బాబు మంచి పని చేశారు, గౌరవంగా చూడాలన్నా: కేసీఆర్, ఏపీవారితో మాకే లాభం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనకు విద్యుత్ ఇవ్వకుండా మంచి పనే చేశారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం అన్నారు. చంద్రబాబు ఇప్పుడు కరెంట్ ఇచ్చినా తీసుకోమన్నారు. ఏపీ సీఎం చంద్రబాబును, మంత్రులను గౌరవంగా చూడాలని అధికారులను ఆదేశించామని చెప్పారు.
విద్యుత్ ఇవ్వకుండా చంద్రబాబు మంచి పని చేశారని, వచ్చే ఏడాది నాటికి తెలంగాణలో మిగులు విద్యుత్ ఉంటుందన్నారు. వచ్చే ఏడాది మార్చి నుండి రైతులకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ ఇస్తామని చెప్పారు.
సచివాలయానికి వాస్తు లేదంటే నానా యాగీ చేశారని మండిపడ్డారు. కొత్త సచివాలయం కట్టి చూపిస్తామని చెప్పారు. నూటికి నూరు శాతం కొత్త సచివాలయం కడతామన్నారు. హెచ్ఓడీలన్నీ ఒకేచోట ఉంటే తప్పేమిటని ప్రశ్నించారు. నార్కట్‌పల్లి ఓసీటీఎల్‌ను మూతపడనీయమని చెప్పారు.
షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే తీసుకొని రైతులకు జాతీయం చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ తెలంగాణ ప్రభుత్వానికి శాశ్వత టూరిస్ట్‌లు అన్నారు. వారు మరో నాలుగున్నరేళ్లు ఇక్కడే ఉన్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.

ఏపీ ప్రభుత్వం నుండి జీతాలు తీసుకొని తెలంగాణ ప్రభుత్వానికి ట్యాక్స్‌లు కడితే మాకే మంచిదన్నారు. హైకోర్టు విషయంలో పదిహేను రోజుల్లో శుభవార్త వస్తుందని చెప్పారు. ఆసరాలో అనర్హులు పెన్షన్ తీసుకుంటే ఫిర్యాదు చేయాలన్నారు. అధికారుల పైన చర్యలుంటాయన్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పైన రేపు వ్యాప్కో సంస్థ సర్వే చేస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు డిజైన్లో లోపాలున్నాయన్నారు.
గొప్పలకు పోయి కరవు మండలాలను ప్రకటించమన్నారు. తీవ్రత, వాస్తవాలు తెలుసుకున్నాక వాటిని ప్రకటిస్తామని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. కమల్ నాథన్ కమిటీ ఉద్యోగు విభజన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందన్నారు.
ఆంధ్రా విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్స్ ఇస్తే ఏమవుతుందని కొందరు అంటున్నారని, అది సరికాదన్నారు. ఇవాళ ఫీజులు ఇస్తే రేపు ఉద్యోగాలకు క్యూ కడతారని చెప్పారు. దీంతో తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాల్లో అన్యాయం జరుగుతుందన్నారు.












Click it and Unblock the Notifications