వచ్చే మంగళవారం తేలిపోనున్న అమరావతి భవిష్యత్తు?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించిన కీలకమైన విచారణ సుప్రీంకోర్టులో నవంబర్ 1న జరగబోతోంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుని విచారించబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్, అమరావతి పరిరక్షణ కమిటీ, మరో ముగ్గురు వేసిన పిటిషన్ల మీద అదేరోజు విచారణ జరగబోతోంది.

చీఫ్ జస్టిస్ ఏం చేయబోతున్నారు?
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత నవంబరు 8న పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ తరుణంలో ఆయన ఈకేసు విచారణ చేపట్టడం విశేషం. ఆ ఒక్కరోజు అమరావతికి సంబంధించిన విషయం తేలిపోతుందా? లేదంటే సుదీర్ఘకాలం కొనసాగుతుందా? అనే ఆసక్తి రాష్ట్ర ప్రజలందరిలో నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్టే ఇవ్వమని కోరుతోంది.
ప్రభుత్వం తరఫున దాఖలైన పిటిషన్ లోని వాదనలు సరిగానే ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడితే స్టే ఇచ్చే అవకాశం ఉంది. అలాకాకుండా ఎస్ఎల్పీకి ప్రాధాన్యత లేదని భావిస్తే కొట్టివేయవచ్చని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. అలా కొట్టేస్తే కేసు విచారణ కూడా సత్వరమే తేలిపోనుందని, లేదంటే రెండు పక్షాల వాదనలు విని ఏది న్యాయంగా ఉందనిపిస్తే అదే తీర్పు ఇవ్వడానికి కూడా అవకాశముందంటున్నారు.

ప్రభుత్వ వాదనలో పస లేదంటున్న చంద్రబాబు
ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించిన వాదనలో పస లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఆయన పార్టీ సమీక్షల్లో కూడా అమరావతిపై ఒకటోతేదీన విచారణ జరగబోతోందని, రాజధాని వ్యవహారం ఆరోజు తేలిపోనుందని చెబుతున్నారు. అయితే వైసీపీ వర్గాలు తమకు హైకోర్టు తీర్పు మీద స్టే వస్తుందనే ఆశాభావంతో ఉన్నామంటున్నాయి.
రాజ్యాంగపరమైన అంశాలు లేవనెత్తాం కాబట్టి తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని ఆ పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. అయితే అమరావతికి సంబంధించి లోతైన విచారణ జరగాలని సుప్రీం ధర్మాసనం భావిస్తే సుదీర్ఘకాలం పట్టడానికి ఛాన్సుంది. చంద్రబాబు మాత్రం నవంబరు 1నే తేలిపోనుందంటున్నారు. రాష్ట్ర ప్రజలందరి భవిష్యత్తును దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక కీలకమైన తీర్పుతో ప్రభావితం చేయబోతోంది.

పాదయాత్రకు తాత్కాలిక విరామం
అసెంబ్లీ టు అరసవెల్లి పేరుతో గత నెల 12వ తేదీన 60రోజుల సుదీర్ఘ పాదయాత్రను ప్రారంభించిన అమరావతి ప్రాంత రైతులు తమ యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా యాత్ర చేస్తున్నారంటూ పోలీసులు అడ్డగించడంతో వారు న్యాయస్థానంలో తేల్చుకొని తిరిగి పాదయాత్రను కొనసాగించాలనే ఉద్దేశంతో రైతులున్నారు. ఉత్తరాంధ్రలో మూడురాజధానులకు అనుకూలంగా సభ జరగడం, మంత్రుల ప్రకటనలతో యాత్ర ఉత్తరాంధ్ర అయితే రైతులు తాత్కాలిక విరామం ప్రకటించడంతో ఏం జరుగుతుందో చూడాల్సి ఉందంటున్నారు.












Click it and Unblock the Notifications