దేవాదాయ శాఖ శాంతి మేడమ్ వ్యవహారం పిన్ టూ పిన్ లాగుతున్న అధికారులు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ప్రభుత్వ శాఖలకు చెందిన అనేక మంది అధికారుల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని కూటమి ప్రభుత్వంలోని పెద్దలు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అనేక జిల్లాల్లో పని చేస్తున్న చాలా మంది సీనియర్ అధికారులు గతంలో అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల నిత్యం వార్తలో నిలిచిన దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కే. శాంతి వ్యవహారంపై అనేక ఆరోపణు వినిపిస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో దేవాదాయ శాఖలో అనేక అవకతవకలు జరిగాయని, ప్రభుత్వ నియమాలను దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి చూసిచూడనట్లు వ్యవహరించారని పై అధికారుల విచారణలో వెలుగు చూసింది. దేవాదాయ శాఖకు చెందిన అనేక షాపులకు వేలం వెయ్యకుండా అప్పటి వైసీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు సూచించిన వ్యక్తులకు దుకాణాలు కట్టబెట్టారని మహిళా అధికారిణి శాంతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

కే. శాంతికి మొదటి పోస్టింగ్ విశాఖ జిల్లాలోనే ఇచ్చారు. 2020 ఏప్రిల్ నుంచి 2022 జూన్ 30వ తేదీ వరకు శాంతి దేవాదాయ శాఖ సహాయ కమినర్ గా పని చేశారు. ఆ సమయంలో శాంతి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. సహాయ కమిషనర్ గా ఉన్న శాంతి ఆమె హోదాను మరిచిపోయి ఉప కమిషనర్ పుష్ప వర్దన్ పై దురుసుగా ప్రవర్తించారని, ఆయన మీద ఇసుక చల్లారని ఆరోపణలు ఉన్నాయి.
గతంలో ఎర్నిమాంబ ఆలయం హుండీల లెక్కింపు వ్యవహారంలో అప్పటి ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరాజు అనేక అవకతవకలు పాల్పడ్డారని తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. తరువాత అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరాజును అశీల్ మెట్ట సంపత్ వినాయగర్ ఆలయంలో హుండీ ఆదాయం లెక్కింపు విధులను అప్పగించిన దేవాదాయ శాఖ సహాయ కమిషర్ శాంతి వివాదాలకు కారణం అయ్యారు.
గతంలో హుండీ లెక్కింపు విధులకు శ్రీనివాస రాజు పాల్గొనకూడదు అని సంబందిత అధికారులు ఆదేశాలు జారీ చేసిన దేవాదాయ సహాయ కమిషనర్ శాంతి ఆ ఆదేశాలను పట్టించుకోలేదని ఉన్నత స్థాయి అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఆ సందర్బంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి తీసుకున్న నిర్ణయంతో దేవాదాయ శాఖ అధికారులు హడలిపోయారని తెలిసింది.
విశాఖ నగరంలోని దేవాలయాలకు ఉన్న లీజు దుకాణదారులను అనేక ఇబ్బందులకు గురి చేశారని, తరువాత వారి పనులను చేయించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. పాకాయరావు పేట, చోడవరంలోని హోర్డింగ్ రెస్ట్ హౌస్,, చోడవరం విఘ్నేశ్వర స్వామి ఆలయం, అనకాపల్లి మెయిన్ రోడ్డులోని సిద్దేశ్వర స్వామి ఆలయాలకు చెందిన షాపులకు ఎలాంటి వేలం వెయ్యకుండా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి అప్పటి వైసీపీ నాయకులు చెప్పిన వ్యక్తులకు ఆ దుకాణాలు అప్పగించారని అదికారుల విచారణలో వెలుగు చూసింది.
పలు వివాదాల్లో చిక్కుకున్న శాంతిపై విచారణకు ఆదేశించారు. ఇప్పుడు దేవాదాయ శాఖకు చెందిన సీనియర్ అధికారులు అదే శాఖ సహాయ కమిషనర్ శాంతిపై వచ్చిన ఆరోపణల విచారణ జరిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి సిద్దం అవుతున్నారని తెలిసింది. మొత్తం మీద వారం రోజుల నుంచి నిత్యం వార్తలో ఉన్న దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్దం అవుతోందని తెలిసింది.












Click it and Unblock the Notifications