పేరు మార్చింది కడప ఒక్కటే కాదు: చేనేతకు ఊపిరి పోసిన చంద్రబాబు
Chandrababu: మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అనేక రంగాలకు ఊతమిచ్చింది.
ప్రత్యేకించి చేనేత రంగానికి ఊపిపోసినట్టయింది. చేనేత కార్మికుల ఇళ్లకు ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయడం అనేది వారిని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదు. పవర్ లూమ్స్‌కు మరింత వెసలుబాటును కల్పించింది మంత్రివర్గం.

ప్రతి నెలా 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం.. ఈ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్టయింది. రాష్ట్రవ్యాప్తంగా సహకార, సహకారేతర రంగాల్లో కొనసాగుతున్న దాదాపు 91 వేలకుపైగా పవర్‌లూమ్, చేనేత పరిశ్రమకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పించడం అనేది అసాధారణ నిర్ణయంగా చెబుతున్నారు.
చేనేత పరిశ్రమ మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్న విషయం తెలిసిందే. ఉమ్మడి అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు వంటి పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున పవర్‌లూమ్స్ కొనసాగుతున్నాయి. మంగళగిరి, ధర్మవరం వంటి పట్టణాలకు అదే ప్రధాన ఆదాయ వనరు కూడా. అలాంటి రంగానికి ప్రోత్సాహం కల్పిస్తూ ఏపీ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి.
అలాగే- అత్యంత కీలకమైన ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ అంశంపైనా కేబినెట్ భేటీ చర్చించింది. దీనిపై నియమించన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై మంత్రులు క్షుణ్నంగా చర్చించారు. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని ఏబీసీడీగా వర్గీకరణ చేయాలంటూ మిశ్రా కమిషన్ సిఫారసు చేసింది. దీనికి బదులుగా జిల్లాను యూనిట్‌గా తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది.
అనంతరం దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై మంత్రులు ఆమోదం తెలిపారు. 2026 జనాభా లెక్కల వివరాల సేకరణ ముగిసిన తరువాత జిల్లా యూనిట్‌గా వర్గీకరణ చేపట్టాలని నిర్ణయించారు. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో ఓ తీర్మానాన్ని ఆమోదించే అవకాశాలు లేకపోలేదు.
అదే సమయంలో కడప పేరులో కూడా ఏపీ మంత్రివర్గం మార్పులు చేర్పులు చేసింది. ప్రస్తుతం వైఎస్ఆర్ జిల్లాగా కొనసాగుతుండగా.. ఇందులో కొత్తగా కడప పేరును చేర్చాలని కేబినెట్ తీర్మానించింది. ఇకపై వైఎస్ఆర్ కడపగా రూపాంతరం చెందుతుంది. అదే సమయంలో- వైఎస్‌ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును కూడా మార్చింది. ఇందులో వైఎస్ఆర్ పేరును తొలగించి- తాడిగడప మున్సిపాలిటీగా నామకరణం చేయాలని నిర్ణయించింది.












Click it and Unblock the Notifications