న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చుతారా -సహించబోం : అనుచిత పోస్టుల కేసులో హైకోర్టు..!!
న్యాయవాదులుగా న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సిందిపోయి.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడి ప్రతిష్టను దిగజార్చడం ఏమిటని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలను ఎంతమాత్రం సహించేదిలేదని తేల్చి చెప్పింది. ఎవరుపడితే వారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం , సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం , వీడియోలు అప్లోడ్ చేయడాన్ని ఒప్పుకునేది లేదని స్పష్టం చేసింది. న్యాయవాదులు న్యాయవ్యవస్థను గౌరవిస్తేనే ప్రజల్లోనూ ఆ భావన కొనసాగుతుందని వ్యాఖ్యానించింది.
సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ స్టాండింగ్ కౌన్సిల్, హైకోర్టు న్యాయవాది మెట్టా చంద్రశేఖరరావు , మరో న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి , సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జి .రమేశ్ కుమార్ వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కేజీ కృష్ణమూర్తి, హేమేంద్రనాథ్ రెడ్డి, న్యాయవాది కోదండరామిరెడ్డి వాదనలు వినిపించారు. మెట్టా చంద్రశేఖరరావు, గోపాలకృష్ణ కళానిధి తమ వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తంచేశారని వారు వాదించారు.

కోర్టును లిఖితపూర్వకంగా క్షమాపణ కోరుతూ భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయబోమని హామీ కూడా ఇచ్చారన్నారు. వారి క్షమాపణలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు వారిపై కోర్టు ధిక్కార చర్యలను మూసివేసిందన్నారు. వారి వయస్సు, అనారోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని వారికి బెయిల్ మంజూరు చేయాలని కోరారు. సీబీఐ న్యాయవాది కె. చెన్నకేశవులు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందువల్ల వారికి బెయిల్ మంజూరు చేయరాదన్నారు. కింది కోర్టు రెండ్రోజుల పాటు నిందితులను సీబీఐ కస్టడీకి ఇచ్చిందని, న్యాయవాది కళా నిధి అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు.
కస్టడీ ఉత్తర్వులు అమల్లో ఉండగా బెయిల్ మంజూరు చేయరాదన్నారు. అది న్యాయపరమైన చిక్కులకు దారితీస్తుందన్నారు. కస్టడీ ముగిసిన తరువాత కూడా వారిని జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉంచాల్సిన అవసరం ఏముందో చెప్పాలని సీబీఐని ఆదేశించింది. ఓ వైపు దిగువ కోర్టు పోలీసు కస్టడీకి ఇచ్చి విచారణ ప్రక్రియ జరుగుతున్నప్పుడు హైకోర్టు బెయిలు మంజూరు చేయడం న్యాయపరమైన చిక్కులకు దారితీస్తుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications