తెలంగాణ నుంచి నరుక్కొస్తున్న పార్టీ.. అదిరిందెహే!
నందమూరి సుహాసినితో ఇప్పటికే ఒక రాజకీయ పార్టీ సంప్రదింపులు మొదలు పెట్టినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కమ్మ సామాజికవర్గానికి దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టిన ఓ రాజకీయ పార్టీ తాజాగా దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని సంప్రదించినట్లు తెలుస్తోంది. తెలంగాణ టీడీపీకి ఉపాధ్యక్షురాలిగా ఉన్న సుహాసిని 2018 ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు నందమూరి వారసురాలిపై దృష్టి సారించినట్లు సమాచారం.

గత ఎన్నికల్లో కూకట్‌పల్లిలో పోటీ.. ఓటమి
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ జట్టుకట్టి పోటీ చేశాయి. గులాబీ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగింది. అప్పుడే తెలుగుదేశం పార్టీలోచేరిన సుహాసిని కూకట్ పల్లి నుంచి తెలుగుదేశం తరఫున బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. అక్కడి నుంచి మాధవరం కృష్ణారావు విజయం సాధించారు. ఓటమిపాలైనప్పటికీ సుహాసిని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టీడీపీ నుంచి పోటీచేస్తారా? లేదంటే రాజకీయమార్పులేమైనా ఉంటాయా? అనే చర్చ ప్రారంభమైంది. నందమూరి, నారా కుటుంబ పార్టీ టీడీపీ అని, కచ్చితంగా ఆ పార్టీ నుంచే పోటీచేస్తారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో కూడా సుహాసిని టీడీపీ నుంచి పోటీచేస్తారని గట్టిగా చెబుతున్నారు. కూకట్ పల్లి నుంచే మళ్లీ బరిలోకి దిగుతారా? వేరే నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంటారా? అనే చర్చ కూడా నడుస్తోంది.

సుహాసినితో టచ్‌లోకి వెళ్లిన ఓ పార్టీ?
నందమూరి సుహాసినితో ఇప్పటికే ఒక రాజకీయ పార్టీ సంప్రదింపులు మొదలు పెట్టినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కమ్మ సామాజికవర్గానికి చేరువయ్యేందుకు ప్రయత్నాలు సాగిస్తున్న పార్టీ సుహాసినితో టచ్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికారని, తమ పార్టీలోకి వస్తే రాజకీయ భవిష్యత్తుకు ఢోకా ఉండబోదని చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సుహాసిని స్పందించారా? లేదా? అనేది తెలియలేదు. ఆమెకు ప్రతిపాదించిన పార్టీ కూడా సుహాసిని స్పందన కోసం వేచిచూస్తోంది.

సంప్రదింపులు జరిపిందెవరు?
నందమూరి సుహాసినితో సంప్రదింపులు జరిపిన పార్టీ ఏంటి? అధికారపార్టీ నుంచి అయితే ఎవరు సుహాసినితో మాట్లాడారు? ఒకవేళ కాంగ్రెస్, బీజేపీ నుంచి ఆహ్వానాలు వెళ్లి ఉంటే .. ఎవరు మాట్లాడి ఉంటారు? భవిష్యత్తులో సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి? కమ్మ సామాజికవర్గం ఓట్లను గురిపెట్టిన పార్టీ ఏంటనే ఆరా పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది. సుహాసిని విషయంలో జరుగుతున్న ప్రచారం వాస్తవమో కాదో స్పష్టత ఇవ్వాల్సింది కూడా ఆమే. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు దగ్గరపడుతున్నాయి.












Click it and Unblock the Notifications