కుల వృత్తుల వారి అరిగోస ... లాక్ డౌన్ తో కుండలు కొనే వాళ్ళు లేక ..కుమ్మరుల జీవనమెలా ?
అసలే కుల వృత్తులు కనుమరుగవుతున్న తరుణంలో ఎవరో కొద్ది మంది కుల వృత్తులు నమ్ముకుని బ్రతుకుతున్న వారి బతుకులపై కరోనా విషం చిమ్మింది. మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా కుండలను తయారు చేసి అమ్ముకునే కుమ్మరులు కరోనా లాక్ డౌన్ ప్రభావంతో ఉపాధిని కోల్పోయారు. దీంతో మట్టినే నమ్ముకొని మట్టితో వివిధ రకాల గృహోపకర వస్తువులు తయారు చేసి పొట్టపోసుకునే కుమ్మరి వృత్తిదారుల జీవనం దుర్భరంగా మారింది. వారి కంచాల్లో మన్ను పడింది .
కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ .. మహిళలకు పెరిగిన గృహ హింస

కుమ్మరి వృత్తిపై కరోనా ప్రభావం
చేతి వృత్తుల వారు ఒకప్పుడు గొప్పగా జీవించారు. మారుతున్న కాలంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేటి రోజుల్లో కుల వృత్తులను నమ్ముకుంటే కష్టం అన్న భావన వ్యక్తం అవుతుంది . ఒకప్పుడు మట్టి పాత్రలను ఎక్కువగా వినియోగించిన వారు ఇప్పుడు ప్లాస్టిక్, గ్లాస్ , స్టీల్ వంటి వస్తువుల వినియోగిస్తున్నారు . అసలే కుల వృత్తులను చేస్తున్న వారు తగ్గిపోతున్నారు అనుకుంటే ఇక ప్రస్తుతం కరోనా లాంటి ఊహించని విపత్తు వారి జీవితాల మీద కోలుకోలేని దెబ్బ కొడుతుంది . కుమ్మరి జీవన చక్రం ఆగిపోతుంది. పూర్వం ప్రతి ఇంట్లో మట్టి పాత్రలనే వినియోగించే వారు కానీ, నేడు వాటిని ఉపయోగించే వారే కరువయ్యారు.

పేదవాడి ఫ్రిజ్ గా పేరొందిన మట్టి కుండల కొనుగోలు లేక తిప్పలు
పేదవాడి ఫ్రిజ్ గా పేరొందిన మట్టి కుండలకు వేసవి కాలంలో మాత్రం కాస్త గిరాకీ ఉంటుంది. మిగిలిన రోజుల్లో పండుగలు, వివిధ అధ్యాత్మిక కార్యక్రమాలు, కర్మ కాండలకు తప్ప కుమ్మరి కుండలను, వారు తయారు చేసిన వివిధ మట్టితో తయారు చేసిన ఉపకరణాలను ఎవరూ కొనుగోలు చెయ్యరు . ఇక ఇప్పుడు కుమ్మరి కుండలు కొనుగోలు చేసే నాధుడు లేరు. పైసా ఆదాయం లేక మట్టిని నమ్ముకున్న మట్టి మనుషులు కన్నీటి పర్యంతం అవుతున్నారు .

సీజన్ లో ఊహించని కరోనా లాక్ డౌన్ దెబ్బ
ఇప్పటికే కుమ్మరుల కులవృత్తికి ఆదరణ లేకపోవటంతో చాలా మంది వృత్తి మానేశారు. అధిక సంఖ్యలో కుమ్మరులు వ్యవసాయ కూలీ పనులకు వెళ్తున్న పరిస్థితి ఉంది. వృత్తినే నమ్ముకొని ఉన్న కుమ్మరి కుటుంబాలకు సైతం చక్రం ముందు కూర్చుని చాలా ఓపికగా కుండలు తయారు చేసినా , వాటిని అమ్ముకోలేని ప్రస్తుత పరిస్థితులతో పూట గడవడం లేదు. కుండలు తయారు చేయడానికి ప్రధానంగా అవసరమైన ముడి సరుకు బంక మట్టి దూర ప్రాంతాలకు వెళ్ళి తెచ్చుకొని ఎన్నో కష్టాలకోర్చి తయారు చేసిన వీటిని కొనే వారు ఉండడం లేదని కుమ్మరులు వాపోతున్నారు. సీజన్ బట్టి కుండలు, ముంతలు, దీపాల ప్రమిదలు, పూల కుండిలు, నీళ్ళ బుంగలు తదితర వస్తువులు తయారు చేస్తారు.

కుండలు కొనుగోలు చేసే నాధుడు లేక దిగాలుగా కుమ్మరులు
ఇక ముఖ్యంగా ఎండాకాలం అమ్ముడు పోతాయని నమ్మి కుండలు తయారు చేసి కరోనా ప్రభావంతో అమ్ముడు పోక దిగాలు చెందుతున్నారు కుమ్మరులు .ఎంత కష్టపడిన ఫలితం లేకుండా పోయిందని కుమ్మరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ అమలు కావడంతో కుమ్మరులకు ఉపాధి కరువైంది. ఏలూరులో కుండల కొనుగోలుకు ఏ ఒక్కరైనా రాకపోతారా అని ఓ మహిళ ఎదురుచూస్తున్న దృశ్యం తాజాగా కుమ్మరుల పరిస్థితికి అద్దం పడుతుంది . ఇలా కుల వృత్తులను నమ్ముకుని కరోనా దెబ్బకు విలవిలలాడుతున్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలి . కానీ ప్రభుత్వాలది ఎప్పుడూ కుల వృత్తులపై సీతకన్నే అనే అభిప్రాయం వారి నుండి వ్యక్తం అవుతుంది.