తిరుపతి,విశాఖ,హైదారాబాద్ సహా పలు ప్రాంతాల రైళ్లు రద్దు..లిస్టులో..!!
మొంథా తుఫాను వణికిస్తోంది. ఏపీ మొత్తం తుఫాను వేళ అప్రమత్తం అయింది. కోస్తా తీర ప్రాంతం లో ఇప్పటికే తుఫాను ప్రభావం మొదలైంది. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రయాణాలు రద్దు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో పలు రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఏకంగా 72 రైళ్లను రద్దు చేసింది. అటు విమానాలు.. బస్సుల రాకపోకల పైనా తుఫాను ప్రభావం పడింది. ప్రయాణీకులు తాజా నిర్ణయాలకు అనుగుణంగా సహకరించాలని రైల్వే అధికారులు కోరుతున్నారు.
మొంథా తుపాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. అలానే తెలంగాణ, చెన్నై, భువనేశ్వర్ నుంచి బయలుదేరి ఏపీ మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేసింది. మూడు రోజులపాటు ఈ రైళ్లు రద్దు అయ్యాయి. విజయవాడ డివిజన్ మీదుగా నడిచే రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది. మంగళ, బుధవారం బయలుదేరే పలు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి. రాజమండ్రి, నిడదవోలు, గుంటూరు, కాకినాడ నుంచి బయలుదేరేవి, తెనాలి, మార్కాపురం, మచిలీపట్నం, నర్సాపురం నుంచి బయలుదేరేవి, విశాఖ, ఒంగోలు, భీమవరం, మాచర్ల నుంచి బయలుదేరే రైళ్లు రద్దు చేశారు. రైళ్ల గురించిన సమాచారాన్ని ప్రయాణికుల మొబైల్‌కు సందేశాలు ద్వారా సమాచారం ఇస్తున్నారు.

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనల చేసింది. ప్రజలు అత్యవసరమైతేనే రైళ్లలో ప్రయాణం చేయాలని సూచించింది. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైలు స్టేటస్‌ను చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రద్దైన రైళ్ల జాబితాలో విశాఖ నుంచి హైదరాబాద్ బయల్దేరాల్సిన గోదావరి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ వెళ్లాల్సిన గరీబ్‌రథ్, దిల్లీకి వెళ్లే ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, విశాఖ- తిరుపతి డబుల్‌డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్, మెము, ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. ప్రయాణీకులు NTES మొబైల్ యాప్ ద్వారా రైళ్ల రాకపోకల కచ్చిత వివరాలు తెలుసుకోవచ్చు. https://enquiry.indianrail.gov.in వెబ్ సైట్‌లో కూడా వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ప్రయాణీకుల సమాచారం కోసం ప్రత్యేకం గా హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసారు.












Click it and Unblock the Notifications