ఆ ఐదుగురిని టార్గెట్ చేసిన సీఎం జగన్?
రానున్న ఎన్నికల్లో మొత్తం 175 నియోజకవర్గాలను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్యంగా ఐదుగురు నేతలపై దృష్టిసారించారు. ముందుగా వీరిని ఓడించగలిగితే ఎటువంటి ఇబ్బందులు ఉండవనేది తమ నేత భావిస్తున్నట్లు వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గద్దె రామ్మోహన్ తోపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ఐదుగురిలో ఉన్నారు. పవన్ పోటీచేసే నియోజకవర్గం ఖరారు కానప్పటికీ ఎక్కడి నుంచి బరిలోకి దిగితే అక్కడి నుంచి ఆయన్ను ఓటమిపాలు చేయాలనే పట్టుదలను జగన్ ప్రదర్శిస్తున్నారు.

కుప్పంతో ప్రారంభించి విజయవాడ తూర్పు వరకు..
కుప్పం నుంచి వరుసగా ఏడుసార్లు విజయం సాధించిన చంద్రబాబును ఓడించడానికి ఇప్పటినుంచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ ప్రారంభించింది. దీనికి అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో "రివర్స్" లో వైసీపీకి చెక్ పెట్టాలని బాబు ఆలోచిస్తున్నారు. టెక్కలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అచ్చెన్నాయుడు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పీఎఫ్ నిధుల గోల్ మాల్ కు సంబంధించి కరోనా సమయంలో నిమ్మాడలో ఉన్న అచ్చెన్నను ప్రభుత్వం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పార్టీ కీలక నేతలైన వీరిద్దరిని ఓడించగలిగితే టీడీపీ శ్రేణుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవచ్చనేది వైసీపీ యోచనగా ఉంది.

చికాకు పరుస్తున్న గోరంట్ల
గోరంట్ల బుచ్చయ్యచౌదరి చేసే విమర్శలు ప్రభుత్వాన్ని తీవ్రంగా చికాకు పరుస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో ఆయన పోటీచేస్తారా? లేదా? అనే విషయమై స్పష్టత లేనప్పటికీ పోటీచేస్తే మాత్రం బుచ్చయ్యను ఓడించడానికి వైసీపీ ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తోందని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. విజయవాడ తూర్పు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గద్దే రామ్మోహన్ ను ఓడించడంద్వారా రాజధానిలో పట్టుందని నిరూపించుకోవడానికి అవకాశమని పార్టీ భావిస్తోంది. వైసీపీ ఏర్పాటైన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీనే గెలుపొందింది.

ప్రధాన లక్ష్యం... జనసేనాని
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా అవసరమైతే పొత్తులకు కూడా సిద్ధమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. నిరంతరం జగన్ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరుగుతున్నారు. అందుకు బీజేపీతో ఉన్న పొత్తును కూడా వదులుకుంటున్నట్లు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వైసీపీ లేని ఏపీనే మనకు కావాలంటూ ఆయన జిల్లాల్లో పర్యటిస్తున్నారు.
పవన్ కల్యాణ్ ఫలానా నియోజకవర్గం నుంచి పోటీచేయబోతున్నారనే ప్రచారం నడుస్తున్నప్పటికీ ఆయన ఎక్కడి నుంచి పోటీకి దిగితే అక్కడి నుంచి ఓడించాలనే లక్ష్యంతో వైసీపీ ఉంది. ఏదేమైనప్పటికీ కీలకమైన ఈ ఐదుగురు నేతలను ఓడించడంద్వారా రాష్ట్రంపై తన పట్టును మరోసారి నిరూపించుకోవాలనే భానవలో ఉన్న వైసీపీ ఇప్పటి నుంచే తాను నిర్ధేశించుకున్న లక్ష్యంవైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.












Click it and Unblock the Notifications