అప్పుడు తెలంగాణ -ఇప్పుడు రాజధానులు- చంద్రబాబుకు ఫ్లాష్ బ్యాక్ రిపీట్?
ఏపీలో అమరావతి రాజధాని వర్సెస్ మూడు రాజధానులుగా సాగుతున్న పోరు విపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబుకు సంకటంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమరావతికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మద్దతు కూటగట్టాల్సిన పరిస్ధితుల్లోకి చంద్రబాబు జారిపోతున్నారు. ఇందుకోసం కొత్త నినాదాలు కూడా వెతుక్కోవాల్సిన పరిస్ధితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం సమయంలో ఎదుర్కొన్న తరహా పరిస్ధితులే ఆయనకు రిపీట్ అయ్యేలా ఉన్నాయి.

రాజధానుల పోరులో చంద్రబాబు
ఏపీలో చంద్రబాబు హయాంలో నిర్ణయించిన అమరావతి రాజధాని స్ధానంలో వైసీపీ సర్కార్ మూడు రాజధానుల్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనిపై కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగిలినా వెనక్కి తగ్గేందుకు సిద్ధం కావడం లేదు. అంతే కాదు మూడు రాజధానులపై జనాన్ని రెచ్చగొట్టే పనిలో వైసీపీ సర్కార్ బిజీగా కనిపిస్తోంది. ఇది అంతిమంగా చంద్రబాబు కొంపముంచేలా కనిపిస్తోంది. ఇప్పటివరకూ కోర్టుల్లో అమరావతి రాజధానికి అనుకూలంగా తీర్పు వస్తే దాన్ని తమ విజయంగా చెప్పుకోవచ్చని భావించిన చంద్రబాబుకు, టీడీపీకి .. జగన్ తాజా వ్యూహంతో ఉక్కిరిబిక్కిరవక తప్పడం లేదు.

ఉత్తరాంధ్ర, సీమల్లో వ్యతిరేకత
అమరావతి రాజధానిపై చంద్రబాబు అనుసరిస్తున్నవ్యూహం ఇప్పుడు మిగతా ప్రాంతాల్లో వ్యతిరేకత పెంచేలా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఉత్తరాంధ్ర, రాయలసీమలో జనాన్ని రెచ్చగొట్టేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలే. అయితే వైసీపీ పిలుపులకు స్పందించి జనం ఇప్పటికే రోడ్లపైకి వస్తుండగా.. రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్రమైతే అప్పుడు ఆ రెండు ప్రాంతాల్లో టీడీపీకి ఇబ్బందులు తప్పకపోవచ్చు. అలాగే ప్రస్తుతానికి అమరావతిపై కలిసున్న విపక్ష పార్టీలు తుదికంటా నిలబడకపోతే కూడా టీడీపీ దోషిగా మిగిలిపోవడం ఖాయం.

తెలంగాణ ఫ్లాష్ బ్యాక్ రిపీట్?
గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబు ఇలాంటి సమస్యే ఎదుర్కొన్నారు. స్వతహాగా సమైక్య వాది అయిన చంద్రబాబు తెలంగాణలో కేసీఆర్ ధాటికి ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమంలో ఎటు వెళ్లాలో తెలియక నాది రెండుకళ్ల సిద్దాంతమని ప్రకటించారు. అయినా తెలంగాణ వాదులు నమ్మలేదు. దీంతో చివరికి తెలంగాణకు మద్దతుగా కేంద్రానికి లేఖ రాశారు. తద్వారా వ్యతిరేకతను కాస్తయినా తగ్గించుకునే ప్రయత్నం చేశారు. ప్రత్యర్ధిగా ఉన్న జగన్ పూర్తిగా సమైక్యవాద వైఖరికే కట్టుబడినా చంద్రబాబు మాత్రం సమైక్య అజెండాను మోయలేదు. చివరికి ఏపీలో ప్రజలు 2014లో ఆయనకే పట్టం కట్టారు. తెలంగాణకు మద్దతుగా లేఖ ఇచ్చినా అక్కడ జనం నమ్మలేదు.

చంద్రబాబు నినాదాల వేట?
ప్రస్తుతానికి అమరావతికి వ్యతిరేకంగా ఉత్తరాంధ్రలో పోరు ముమ్మరమవుతోంది. దీంతో టీడీపీ విశాఖ రాజధాని వద్దనలేక ఇరుకునపడుతోంది. ఈ నేపథ్యంలో సేవ్ ఉత్తరాంధ్ర నినాదాన్ని వినిపించాలని టీడీపీ నేతలకు చంద్రబాబు తాజాగా సూచించారు. కానీ ఇప్పుడు రాజధానిని కాదని సేవ్ ఉత్తరాంధ్ర అన్నా జనం నమ్ముతారో లేదో తెలియదు. అదే సమయంలో కర్నూల్లోనూ ఉద్యమం మొదలైతే అప్పుడు సేవ్ రాయలసీమ అనక తప్పదు. దీంతో ఇప్పుడు కొత్త నినాదాల్ని వెతుక్కునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications