భార్యను లా చదివిస్తున్న గజదొంగ ప్రకాష్ సాహూ
విజయవాడ: ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న గజ దొంగ ప్రకాష్ సాహూ తన భార్యను న్యాయశాస్త్రం చదివిస్తున్నాడు. అందుకు అవసరమైన డబ్బులను అతను సమకూర్చినట్లు సమాచార. ప్రసాదంపాడు సాయిబాబా ఆలయంలో దోపిడీ చేశాడనే ఆరోపణపై విచారణ నిమిత్తం పోలీసులు సాహూను తమ కస్టడీలోకి తీసుకున్నారు.
సాహూ భార్య మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భిలాయ్‌లో న్యాయశాస్త్రం అభ్యసిస్తోంది. పిల్లలు సొంత పట్టణంలోనే పాఠశాలకు వెళ్తున్నారు. సాహూ 1980 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర పొరుగు రాష్ట్రాల్లో సాహూ 47 హిందూ, జైన ఆలయాల్లో దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

కనకదుర్గ గుడిలో ప్రకాష్ సాహూ అమ్మవారి కిరీటంతో పాటు ఆభరణాలన్నీ దోచుకున్నాడు. ఈ సంఘటన 1988లో జరిగింది. శ్రీకాకుళం జిల్లాలోని ఆరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో, విజయనగరం జిల్లాలోని పార్వతీపురం కన్యకాపరమేశ్వరి ఆలయంలో కూడా అతను దోపిడీలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆభరణాలను దోచుకునే ముందు సాహూకు దేవుళ్లకు ప్రార్థనలు చేసే అలవాటు ఉంది. నాలుగు దేవాలయాల్లో దోపిడీకి పాల్పడినట్లు సాహూ అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఒంగోలు, విజయనగరం, తూర్పు గోదావరి, విజయవాడల్లో దోపిడీలకు పాల్పడినట్లు సాహూ అంగీకరించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications