ఏపీలో అరుదైన ఘటన.. ఒకే కుటుంబంలో ముగ్గురికి కానిస్టేబుల్ జాబ్స్ !
అనంతపురం జిల్లాలోని గుత్తి పట్టణం నుంచి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈరోజు ( ఆగస్టు 1, 2025 ) విడుదలైన కానిస్టేబుల్ ఫలితాల్లో మహబూబ్ దౌలా అనే హెడ్ కానిస్టేబుల్ కుమారులు.. మహమ్మద్ అలీ, మహమ్మద్ గౌస్, మహమ్మద్ సమీర్.. ముగ్గురు కూడా ఎంపికవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఈ ముగ్గురు యువకులు చిన్ననాటి నుంచి పోలీస్ శాఖపై ఆసక్తితో పెరిగారు. వారి తండ్రి మహబూబ్ దౌలా కూడా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ఆయన లానే వారు కూడా పోలీస్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. వారి విజయం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఇంట్లో ముగ్గురు సోదరులు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఎంపికవడం అరుదైన ఘట్టమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మహమ్మద్ అలీ, గౌస్, సమీర్‌లకు సోషల్ మీడియాలో కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా ఈ నియామక ప్రక్రియకు సంబంధించి రాతపరీక్ష, శారీరక ప్రమాణాలు (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) వంటి దశల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశారు. మొత్తం 4.5 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు త్వరలోనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అంతే కాకుండా ఎంపికైన అభ్యర్థులు త్వరలోనే వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ తదితర దశలకు హాజరు కావలసి ఉంటుంది.
మరోవైపు ఈ ఫలితాల్లో గండి నానాజి అత్యధికంగా 168 మార్కులు సాధించి టాపర్ గా నిలిచారు. రెండో స్థానంలో జి. రమ్య మాధురి 159 మార్కులు.. మూడో స్థానంలో మెరుగు అచ్యుతారావు 144.5 మార్కులతో ఉన్నారు. ఉత్తీర్ణులైన అభ్యర్ధులను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లు, ట్రైనింగ్ అకాడమీలు, స్పెషల్ యూనిట్లలో వీరు నియమించబడతారు.












Click it and Unblock the Notifications