సభ ముందుకు మూడు రాజధానుల బిల్లు..!? సభలో చర్చ - తేల్చేద్దాం : ఎన్నికల నినాదమా..!!
ఏపీలో రాజధానుల పైన స్పష్టత ఇవ్వాలని జగన్ ప్రభుత్వం భావిస్తోందా. అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయాలంటూ హైకోర్టు తీర్పు తరువాత ఈ అంశం పైన ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. హైకోర్టు తీర్పు పైన అప్పీల్ కు వెళ్లలేదు. బడ్జెట్ ప్రసంగంలోనూ ఎక్కడా మూడు రాజధానుల అంశం ప్రస్తావించలేదు. అమరావతికి మాత్రం నిధులు కేటాయింపు చూపారు. ఇదే సమయంలో మూడు రాజధానులే తమ విధానమని మంత్రులు..వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే, ఈ నెల 21న రాజధానుల అంశం పైన సభలో చర్చ చేపట్టి.. బిల్లు ప్రవేశ పెట్టే అంశం పైన క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

21న సభలో చర్చ..స్పష్టత ఇస్తారా
తాజాగా.. మూడు రాజధానుల అంశం పైన బహుజన పరిరక్షణ ఉద్యమ సమితి నేతలు సీఎం జగన్ ను కలిసారు. సభలో మరోసారి మూడు రాజధానుల బిల్లు ప్రవేశ పెట్టాలని కోరారు. దీనికి సీఎం ఈ నెల 21న సభలో రాజధానుల పై చర్చించి..బిల్లు ప్రవేశ పెట్టటం పైన నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లుగా పేర్కొన్నారు. ఇక, మరో వైపు శాసనసభలో మూడు ప్రాంతాల అభివృద్ధి పైన చర్చ కావాలని వైసీపీ సభ్యులు కోరారు. దీనికి స్పందనగా సమావేశాలు ముగిసే లోగా ఈ అంశం పైన చర్చ చేపడామని స్పీకర్ హామీ ఇచ్చారు. ఆర్దిక మంత్రి బుగ్గన సైతం రాష్ట్రంలో సమతుల అభివృద్ధికి మూడు రాజధానులు కోరుకుంటున్నామని స్పష్టం చేసారు. అయితే, హైకోర్టు స్పష్టమైన ఆదేశాలతో తిరిగి సభలో బిల్లు ప్రవేశ పెట్టటం అంత సులువైన అంశం కాదనే వాదన ఉంది.

మరో సారి బిల్లు సాధ్యమేనా..
కానీ, హైకోర్టు తీర్పు తరువాత సీనియర్ నేత ధర్మాన సీఎం జగన్ కు లేఖ రాసారు. కోర్టు తీర్పు తమ పైన తాము మాట్లాడటం లేదని..శాసనసభకు అధికారం లేదనే అంశం పైన శాసన - న్యాయ వ్యవస్థల పరిధి పైన చర్చ జరగాలని..ఇందుకు సభలో చర్చకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి కొనసాగింపుగా మంత్రి బొత్సా ..సైతం కీలక వ్యాఖ్యలు చేసారు. అమరావతి రాజధానిగా గత ప్రభుత్వం పార్లమెంట్ కు సమాచారం ఇవ్వలేదని.. విభజన చట్టం ప్రకారం 2024 వరకూ హైదరాబాద్ రాజధానిగా కొనసాగుతుందని..ఏపీ రాజధాని హైదరాబాద్ అని వ్యాఖ్యానించారు. తాము శాసన రాజధానిగానే అమరావతిని గుర్తిస్తామని తేల్చి చెప్పారు. ఇక, ఇప్పుడు ప్రభుత్వం సభలో ఈ మొత్తం అంశం పైన చర్చ చేపట్టి..తమ వైఖరి స్పష్టం చేసే అవకాశం కనిపిస్తోంది.

సభ ద్వారా తేల్చేందుకే మొగ్గు
తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని సభలో స్పష్టం చేసేందుకు మొగ్గు చూపుతోంది. అదే సమయంలో న్యాయ స్థానం తీర్పుకు లోబడే ముందుకు వెళ్లే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. తమ విధానం మూడు రాజధానులే..కానీ, న్యాయ పరంగా ఉన్న చిక్కుముడులను పరిష్కరించుకుంటూ ముందుకెళ్తామని సభలో ప్రభుత్వం స్పష్టం చేసే అవకాశం ఉందని అధికార పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక, ఇప్పటికిప్పుడు ఈ అంశం తేలకపోతే.. వైసీపీ మూడు రాజధానుల నినాదంతోనే ఎన్నికల్లోకి వెళ్లే అవకాశం ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. టీడీపీ ఇప్పటికే స్పష్టంగా తమ వైఖరి ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని గా స్పష్టం చేస్తోంది. జనసేన సైతం అమరావతే రాజధానిగా పేర్కొంది. బీజేపీ నినాదం అమరావతికే మద్దతుగా ఉంది.

ఎన్నికల అజెండాగా మారనుందా
దీంతో..వైసీపీ శాసనసభ ద్వారా మూడు రాజధానుల అవసరం ఏంటనేది మరోసారి వివరించి.. తమ స్టాండ్ మరోసారి స్పష్టత ఇవ్వాలని భావిస్తోంది. కానీ, బొత్సా చేసిన వ్యాఖ్యల ద్వారా.. అమరావతి విషయంలో..గత ప్రభుత్వం కారణంగానే రాజధానిగా గుర్తించలేదనే వాదన వినిపంచేందుకు సిద్దం అవుతున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో.. మూడు రాజధానులు - అమరావతి - ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పైన వ్యాఖ్యలతో..ఈ మూడు అంశాల తో పాటుగా ప్రభుత్వ వైఖరి ఏంటనేది ఈ నెల 21న అసెంబ్లీ వేదికగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక, ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ ఇస్తుందీ.. రాజధానుల వ్యవహారం ఏ టర్న్ తీసుకుంటుందనే ఆసక్తి ఇప్పుడు రాజకీయంగా మొదలైంది.












Click it and Unblock the Notifications