జెత్వానీ కేసులో నిందితులుగా ముగ్గురు ఐపీఎస్ లు..! విద్యాసాగర్ రిమాండ్ రిపోర్ట్ సంచలనం..!
ఏపీలో తీవ్ర కలకలం సృష్టించిన ముంబై నటి కాదంబరీ జెత్వానీ వేధింపుల వ్యవహారంలో ఇవాళ మరో సంచలనం నమోదైంది. ఇప్పటివరకూ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీ తొలిసారి ఈ కేసులో నిందితులుగా నమోదయ్యారు. ఈ మేరకు ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు వీరి పేర్లను చేర్చారు.
కాదంబరీ జెత్వానీపై తప్పుడు కేసు పెట్టి ఈ మొత్తం వివాదానికి ప్రధాన కారకుడైన కుక్కల విద్యాసాగర్ ను తాజాగా డెహ్రాడూన్ లో అరెస్టు చేసిన పోలీసులు నిన్న అర్ధరాత్రి విజయవాడకు తీసుకొచ్చారు. తెల్లవారుజామున కోర్టు ముందు ప్రవేశపెట్టి 14 రోజుల రిమాండ్ కు పంపారు. ఈ రిమాండ్ రిపోర్టులో పలు సంచలన అంశాలు ఉన్నాయి. ఇందులోనే ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు పలువురిని నిందితులుగా చేర్చారు.

ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు ఏ2గా, కాంతి రాణా టాటా ఏ3గా, విశాల్ గున్నీ ఏ6గా ఈ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. అప్పటి విజయవాడ వెస్ట్ జోన్ ఏసీపీ హనుమంతరావు ఏ4, ఇబ్రహీపట్నం మాజీ సీఐ సత్యనారాయణను ఏ5గా చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే సస్పెండైన వీరందరినీ తదుపరి విచారణలో భాగంగా త్వరలో అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే రాష్ట్రంలో ఒకేసారి ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధకారులు అరెస్టు అయినట్లు అవుతుంది. దీంతో పోలీసుల తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications