తప్పు చేస్తే నారాయణకైనా శిక్ష తప్పదు: కడప విద్యార్ధినుల ఆత్మహత్య ఘటనపై మంత్రి గంటా
అమరావతి: కడప జిల్లాలోని నారాయణ కాలేజీ హాస్టల్‌లో ఇద్దరు విద్యార్ధినుల ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ప్రభుత్వం నియమించిన కమటీ విచారణ ముగిసింది. ఈ నివేదికను సోమవారం కమిటీ ఛైర్మన్ విజయలక్ష్మీ తిరుపతిలో మంత్రి గంటా శ్రీనివాసరావుకు అందేజేశారు.
ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆత్మహత్య ఘటనపై త్రిసభ్య కమిటీ నివేదిక అందజేసిందని, దానిని ఇంకా పరిశీలించలేదన్నారు. నివేదికను ప్రిన్సిపల్ సెక్రటరీకి అందజేయమని అధికారులకు సూచించినట్టు ఆయన తెలిపారు.
'ప్రభుత్వానికి ఎవరూ చుట్టం కాదు, తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదు, నారాయణ అయినా మరొకరైనా చట్టం ముందు అందరూ సమానమే' అని మంత్రి గంటా వ్యాఖ్యానించారు. ఏపీని ర్యాగింగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

మళ్లీ రాష్ట్రంలో ర్యాగింగ్ ఘటనలు పునరావృతం కాకుండా పలు చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమకు న్యాయం చేయాలని విద్యార్ధినుల తల్లిదండ్రుల అడిగారని ఆయన తెలిపారు. విద్యార్ధినుల ఆత్మహత్య ఘటనలపై కమిటీ నివేదిక ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఎస్వీయూలో ర్యాగింగ్‌కు పాల్పడ్డ ఏడుగురు విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన గంటా వీఐపీ విరామ సమయంలో స్వామి దర్శనం చేసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆయన మాట్లాడుతూ పవన్ వ్యాఖ్యల్ని తాము పాజిటివ్‌గా తీసుకుంటామన్నారు. ఎన్నికల సమయంలో ప్రచారంలో పాల్గొని, పరోక్షంగా పవన్ కళ్యాణ్ తమకు సహకరించారని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications