నాగబాబు రాజ్యసభ సీటును అడ్డుకుందెవరు - తాజా ఆఫర్..!!
ఏపీలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాల భర్తీకి కసరత్తు జరుగుతోంది. వైసీపీకి చెందిన ముగ్గురు అభ్యర్ధుల రాజీనామాతో ఆ స్థానాల్లో ఉప ఎన్నిక లు జరుగుతున్నాయి. అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలంతో కూటమి లోని మూడు పార్టీలకే ఈ సీట్లు దక్కనున్నాయి. అయితే, ఈ మూడు సీట్లలో తొలి నుంచి నాగబాబు పేరు ప్రముఖంగా ప్రచారం లో ఉంది. కానీ, ఇప్పుడు దాదాపు ఫైనల్ అయిన పేర్లలో నాగబాబు కు ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఏం జరుగుతోంది. రాజ్యసభ అభ్యర్ధులుగా ఛాన్స్ దక్కేదెవరికి.
ముగ్గురు అభ్యర్దులు
ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. వైసీపీకి చెందిన బీదా మస్తాన రావు, మోపిదేవి వెంకట రమణ, ఆర్ క్రిష్ణయ్య రాజీనామాలతో మూడు స్థానాలకు ఎన్నికల సంఘం ఉప ఎన్నికలను ప్రకటించింది. అందులో మోపిదేవి, బీదా మస్తాన రావు టీడీపీలో చేరారు. ఒప్పందం లో భాగంగా బీదా మస్తానరావుకు తిరిగి టీడీపీ నుంచి రాజ్యసభ ఇవ్వాల్సి ఉంది. అదే విధంగా ఆర్ క్రిష్ణయ్య బీజేపీ నేతలతో సంప్రదింపుల తరువాత తన ఎంపీ పదవికి రాజీనామా చేసారు. బీజేపీ నుంచి తిరిగి ఆర్ క్రిష్ణయ్య కు ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. దీంతో.. మరో స్థానం కోసం టీడీపీ, జనసేన నుంచి ఆశావాహులు నిరీక్షిస్తున్నారు.

అభ్యర్ధులు ఖరారు
తొలుత మూడు స్థానాలు మూడు పార్టీలకు దక్కేలా ప్రతిపాదనలు తెర పైకి వచ్చాయి. జనసేన నుంచి నాగబాబుకు ఇవ్వాలని నిర్ణయించారు. తాజా ఎన్నికల్లో అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేయాలని భావించినా..ఆ సీటు బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. దీంతో, నాగబాబుకు రాజ్యసభ సీటు ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పుడు మూడు స్థానాల్లో ఒకటి బీజేపీ నుంచి ఆర్ క్రిష్ణయ్య కు ఇవ్వాలని ఆ పార్టీ నేతలు రంగంలోకి దిగారు. పవన్ ఢిల్లీ యాత్ర సమయంలోనూ ఈ అంశం పైన క్లారిటీ ఇచ్చారు. దీంతో, మిగిలిన రెండు స్థానాల్లో ఒకటి టీడీపీ ఇప్పటికే బీదాకు హామీ ఇచ్చింది. మరో స్థానం కోసం పెద్ద ఎత్తున టీడీపీలో పోటీ ఉంది.
నాగబాబుకు తాజా ఆఫర్
తాజాగా చంద్రబాబుతో పవన్ సమావేశ సమయంలోనూ రాజ్యసభ స్థానాల గురించి చర్చ జరిగింది. అయితే, అభ్యర్ధుల ఖరారులో ఉన్న ఒత్తిడి చంద్రబాబు వివరించారు. దీంతో, తమ పార్టీ రెండో స్థానం కోసం సానా సతీశ్ ను టీడీపీ ఖరారు చేసినట్లు సమాచారం. కాగా, ఇప్పటికీ టీడీపీ నుంచి దేవినేని ఉమా, గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహన్ రావు తమ ప్రయత్నాలు కొనసాగిస్తు న్నారు. సానా సతీశ్ తాజా ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయాలని కూటమి నుంచి ప్రయత్నించారు. అటు టీడీపీ.. జనసేన తో సన్నిహిత సంబంధాలు ఉండటంతో.. తాజాగా రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక, ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాల పదవీకాలం విషయానికి వస్తే మోపిదేవి 2026 జనవరి వరకు, మస్తాన్, కృష్ణయ్య పదవీకాలం 2026 జూన్ వరకు ఉన్నాయి. దీంతో..2026లో ఖాళీల భర్తీ వేళ నాగబాబు ఫుల్ టైం రాజ్యసభ ఇస్తామని హామీ దక్కినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications