దుండగుల దాడి: కడుపులో కత్తితో 4కి.మీ ప్రయాణించిన కోళ్ల వ్యాపారి
నెల్లూరు: రెండు లారీలు అపహరణకు గురైన ఘటన నుంచి తేరుకోకముందే తడ ప్రజలను మరో ఘటన భయభ్రాంతులకు గురి చేసింది. డబ్బుతో వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న ముగ్గురు దుండగులు ఓ కోళ్ల వ్యాపారిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ హఠాత్పారిణామానికి భయాందోళనకు గురైన ఆ వ్యాపారి కత్తిగాయాలతో తన మూడు లక్షల నగదుతో సహా తప్పించుకుని తడకు వచ్చేశాడు.

ఈ క్రమంలో మార్గమధ్యంలో చిత్తూరు జిల్లా వరదయపాళెం మండలం కలికి ఆశ్రమం సమీపంలో ముగ్గురు దుండగులు వ్యాపారి చంద్రమౌళిరెడ్డి బైక్‌ను అటకాయించారు. కత్తులతో ఆ వ్యాపారిపై దాడి చేశారు. అతడి మెడపైన వీపుపైన, కడుపులో సైతం కత్తులతో పొడిచారు. హంతకులు డబ్బుకోసం తనని హతమారుస్తున్నారని గ్రహించి వ్యాపారి బైక్‌పై ముందుకురికి తడ వైపుకు వచ్చేశాడు.
అదే సమయానికి అటువైపుగా ఓ వాహనం వస్తుండటంతో ఈ దుండగులు తమ బైక్‌పై పరారైనట్లు తెలిసింది. రక్తపు గాయాలతో ఆ వ్యాపారి తడకు చేరుకుని, ఓ మాంసం వ్యాపారికి విషయం చెప్పి సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే బాధితుడిని సూళ్లూరుపేట ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అక్కడ నుంచి చెన్నైకి తరలించారు.
వేనాటి చంద్రమౌళిరెడ్డి సూళ్లూరుపేటలో బయలుదేరినప్పటి నుంచీ ముగ్గురు దుండగులు హీరోహోండా సీబీజెడ్ అనే బ్లూకలర్ బైక్‌పై వెంబడించినట్లు తెలుస్తోంది. వ్యాపారి వరదయపాళెం వద్ద ఉండగానే ఈ ముగ్గురు మూసివున్న ఓ దాబా వద్ద మద్యం సేవించినట్లు తెలిసింది. వారిని గమనించినట్లు కోళ్ల వ్యాపారి తెలిపాడు.
ఈ ముగ్గురు వ్యక్తులు సుమారు 20 నుంచి 23 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటారని తెలిసింది. ఈ ఘటన ప్రదేశం వరదయపాళెం మండల పరిధిలో ఉండటంతో అక్కడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications