టీడీపీలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు..! రాజీనామాలపై బిగ్ ట్విస్ట్..!
ఏపీలో ఇవాళ విపక్ష వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇవాళ ఒక్కరోజే ఏకంగా ముగ్గురు శాసనమండలి సభ్యులు ఆ పార్టీని కాదని అధికార టీడీపీలో చేరిపోయారు. ఇందులో ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఉన్నారు. వీరంతా ఇప్పటికే వైసీపీకి, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేశారు. దీంతో ఇవాళ వీరు టీడీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇవాళ ఉండవల్లిలో సీఎం చంద్రబాబు సమక్షంలో ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వీరికి చంద్రబాబు స్వయంగా పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా వీరి సేవల్ని తగిన రీతిలో ఉపయోగించుకుంటామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీని వీడి టీడీపీలో చేరడం పట్ల ఎమ్మెల్సీలు సంతోషం వ్యక్తం చేశారు.

మరోవైపు ఎమ్మెల్సీ పదవులకు తాము సమర్పించిన రాజీనామాలకు ఇప్పటివరకు ఆమోదించలేదని ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. రాజీనామాల ఆమోదం కోసం ఆరు నెలలుగా వేచి చూశామన్నారు. రాజీనామా ఆమోదిస్తారన్న నమ్మకం లేదని వారు పేర్కొన్నారు. మండలి చైర్మన్ వెనుక ఉండి నడిపించేవారి వల్ల రాజీనామాలు ఆమోదించలేదని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వ్యాఖ్యానించారు. సోమవారం నుంచి మండలికి వెళ్తాం. ఏం చేసుకుంటారో చేసుకోండని వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి సవాల్ విసిరారు.
వాస్తవానికి ఇప్పటికే వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామాను మండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు ఆమోదించలేదు. దీనిపై ఆయన పలుమార్లు వినతులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం కొనసాగుతుండగానే ఇప్పుడు మరో ముగ్గురు ఎమ్మెల్సీలు ఇవాళ టీడీపీలో చేరారు. వీరు కూడా ఇప్పటికే సమర్పించిన రాజీనామాల్ని ఆమోదించకుండా మండలి ఛైర్మన్ పెండింగ్ లో పెట్టారు. దీంతో ఈ వ్యవహారంలో ఏం జరగబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది.












Click it and Unblock the Notifications