తిరుమల బాలాజీ భవన్ హోటల్ లైసెన్స్ రద్దు, శ్రీవారితో పెట్టుకుంటే ఇంతే
కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువు తీరిన తిరుమలకు ప్రతిరోజు వేల సంఖ్యలో వెలుతున్న భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. నెలకు దాదాపుగా 25 లక్షల మంది తిరుమలలోని శ్రీవారిని దర్శించుకుంటున్నారు. తిరుమల భక్తులను టార్గెట్ చేసుకుని వ్యాపారం చేస్తున్న హోటల్ నిర్వహకులకు టీటీడీ ఈవో శ్యామలరావు సినిమా చూపిస్తున్నారు.
టీటీడీ నిర్ణయించిన ధరల కంటే రెండింతలు, కొందరు అయితే మూడింతలు ధరలు పెట్టి హోటల్ లో వ్యాపారం చేస్తూ భక్తులకు ఆహారం విక్రయిస్తున్నారని, ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కొన్ని నెలల క్రితం వరకు భక్తులు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తిరుమలలోని శ్రీవెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ప్రసాదం తినడానికి వీలుకాని భక్తులు తిరుమలలో హోటల్ కు వెళ్లి టిఫిన్, భోజనాలు చేస్తున్నారు.

పోటీకి వెళ్లి ఎంతకంటే అంతకు వేలంలో హోటల్ లైసెన్స్ లు దక్కించుకున్న కొందరు వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలు పెట్టి శ్రీవారి భక్తులను నిలువుదోపిడీ చేస్తున్నారు అనే విషయం బహిరంగ రహస్యమే. ఇంతకాలం హోటల్ యజమానులతో కుమ్మక్కు అయ్యి భక్తుల ఫిర్యాదులను చూసిచూడనట్లు వ్యవహరించిన అధికారులకు కూడా ఇపుడు దడ మొదలైయ్యింది. టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన తరువాత శ్యామలరావు తిరుమలలోని హోటల్స్ మీద పంజా విసిరారు.
గురువారం తిరుమలలో ఆకస్మికంగా తనిఖీలు చేసిన టీటీడీ ఈవో శ్యామలరావు సదరు హోటల్ యజమానులకు పట్టపగలు చుక్కలు చూపించారు. హోటల్ లో టిఫిన్, భోజనం చేస్తున్న భక్తులు నేరుగా టీటీడీ ఈవోకు, అక్కడే ఉన్న అధికారులకు హోటల్ యజమానుల మీద అనేక ఫిర్యాదులు చేశారు. తిరుమలలోని కొందరు హోటల్ యజమానులు చేస్తున్న ప్రత్యక్ష దోపిడీ గురించి నేరుగా సమాచారం తెలుసుకున్న టీటీడీ ఈవో శ్యామలరావు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్ అయ్యారు.

ఇంత జరుగుతున్నా మీరు ఏం చేస్తున్నారు అంటూ సంబంధిత అధికారులను టీటీడీ ఈవో శ్యామలరావు అక్కడే నిలదీశారు. ఈ దెబ్బకు తిరుమలలో పలు హోటల్స్ మూతపడ్డాయి. తీగలాగితే డొంక కదిలిందని ఇంతకాలం చేతివాటం చూపించిన కొందరు టీటీడీ అధికారుల అసలు భాగోతం బయటకు వచ్చింది. శ్రీవారి భక్తులకు న్యాయం చేస్తామని చెప్పిన టీటీడీ ఈవో శ్యామలరావు అక్కడే భక్తులకు హామీ ఇచ్చారు.లైసెన్స్ ఫీజు సకాలంలో చెల్లించని కారణంగా తిరుమలలోని తొమ్మిది పెద్ద హోటల్ (కాంటీన్)లలో ఒకటైన, కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలోని బాలాజీ భవన్ హోటల్ లైసెన్స్ ను టీటీడీ రద్దు చేసింది.
ప్రస్తుతం హోటల్ చెల్లించవలసిన లైసెన్స్ ఫీజు రూ.76,04,196. ఇందుకు సంబంధించి జూన్ నెలలో సదరు హోటల్‌కు తుది నోటీసులు జారీ చేయడమైనది.పలుమార్లు నోటీసులు జారీ చేసినా, లైసెన్సు ఫీజు చెల్లించనందుకు హోటల్ లైసెన్స్‌ను రద్దు చేశారు. టీటీడీ రెవెన్యూ, హెల్త్, విజిలెన్స్ అధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్ బృందం ఆ హోటల్‌ను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications