మహాపరాధం-కల్తీ గాళ్లను వదలొద్దు-సీఎంకు మఠాధిపతి లేఖ..!
ఏపీలో తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై ( ghee adulteration) సిట్ నివేదిక నేపథ్యంలో మఠాధిపతులు, స్వామీజీలు రగిలిపోతున్నారు. పవిత్రమైన శ్రీవారి లడ్డూను కల్తీ చేసిన నిందితుల్ని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే రాజకీయంగా రగడ జరుగుతున్నా ప్రభుత్వం ఎట్టి పరిస్ధితుల్లో వెనక్కి తగ్గొద్దంటూ వారు సీఎం చంద్రబాబును కోరుతున్నారు. ఈ మేరకు తాజాగా రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర స్వామి సీఎంకు లేఖ రాశారు.
శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై స్పందించిన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సుభుదేంద్ర తీర్థ శ్రీపాద.. జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా గతంలో క్షమించరాని నేరం చేశారని ఆయన తెలిపారు. కల్తీ నెయ్యి సరఫరా చేసి మహా పాపానికి ఒడిగట్టిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి సమర్పించే లడ్డు ప్రసాదంలో గతంలో కల్తీ పదార్థాలు ఉపయోగించారని తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యానని స్వామి లేఖలో తెలిపారు.

కోట్లాదిమంది హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ప్రసాదాన్ని అపవిత్రం చేయడం క్షమించరాని అపరాధమన్నారు. మహా నైవేద్యాన్ని అపవిత్రం చేయడం అత్యంత పాపభూయిష్టమైన చర్య అన్నారు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కేంద్రంగా ఉన్న మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతులుగా, ఈ హేయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ధర్మో రక్షతి రక్షితః అనే సూక్తిని గుర్తుచేస్తూ, ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణించాలన్నారు. నిష్పాక్షిక విచారణ జరిపి, కోట్లాది మంది హిందువుల మనోభావాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుని సనాతన హిందూ ధర్మ విలువలను పరిరక్షించాలని కోరారు.












Click it and Unblock the Notifications