ఆగస్ట్ 2న తిరుమల లడ్డూ పుట్టినరోజు.. లడ్డూకి 310ఏళ్లు.. లడ్డూ చరిత్ర ఇదే!
మహా మహిమాన్వితమైన తిరుమల శ్రీవారికి అత్యంత ఇష్టమైన తిరుమల లడ్డు పుట్టినరోజు జరుపుకుంది. ఆగస్టు 2వ తేదీన తిరుమల శ్రీవారి లడ్డు పుట్టినరోజు అని చెబుతారు. తిరుమల శ్రీవారిని గుర్తు చేసుకోగానే ప్రతి ఒక్కరి మదిలో మెదిలేది మొట్టమొదట తిరుపతి లడ్డు. తిరుమల శ్రీవారి లడ్డుకి అంతటి విశేషం ఉంది. 15వ శతాబ్దంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలిరోజుల్లో వడలు మాత్రమే నైవేద్యంగా పెట్టేవారు.
17వ శతాబ్దం నుండి తిరుమల శ్రీవారికి లడ్డు
ఇక 17వ శతాబ్దం నుంచి బూందీని ప్రసాదంగా పెట్టడం ప్రారంభించారు. ఆ తర్వాత కొంతకాలానికి లడ్డును తయారుచేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టడం ప్రారంభించారు. తిరుమల శ్రీవారి ఆలయం పక్కనే పోటును ఏర్పాటు చేసి లడ్డు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి భక్తులకు కూడా అందిస్తున్నారు. ఇక శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరు తిరుమల లడ్డు రుచిని చూసి మైమరచిపోతారు.

310 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తిరుమల లడ్డు
తిరుమల స్వామివారికి నైవేద్యంగా పెట్టే లడ్డు కాబట్టి దానికి ఎంతో ప్రత్యేకత అని ప్రతి ఒక్కరు భావిస్తారు. తిరుపతి వెళుతున్నారు అని చెప్పగానే ప్రతిఒక్కరూ మాకు లడ్డు కావాలి తెచ్చి పెట్టండి అని అడుగుతారు అంటే దాని స్పెషాలిటీ ఎంతటిదో మనమంతా గుర్తించవచ్చు. తిరుమల శ్రీవారి లడ్డూలో ఉపయోగించే పదార్థాల సుగంధాలు, రుచి, దాని పవిత్రత మాటల్లో చెప్పలేనిది .అటువంటి శ్రీవారి లడ్డు ప్రస్తుతం 310 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
1715 ఆగస్టు 2వ తేదీన తొలిసారి శ్రీవారికి లడ్డూ నైవేద్యం
1715 ఆగస్టు 2వ తేదీన తిరుమల శ్రీవారికి లడ్డూను తయారు చేసి మొట్టమొదట సమర్పించారు. అప్పటినుంచి ఇప్పటివరకు శ్రీవారికి లడ్డుని సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక భక్తులు కూడా లడ్డూలను కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించడం ప్రధానంగా కనిపిస్తుంది. ఒక తిరుమలలో మాత్రమే కాకుండా టిటిడి దేవాలయాలు, కార్యాలయాలు ఎక్కడ ఉన్నా ప్రస్తుతం ఆయా చోట్ల కూడా తిరుమల శ్రీవారి లడ్డూలు అందుబాటులో ఉంటున్నాయి.
ప్రతీరోజూ శ్రీవారి పోటులో మూడు లక్షల లడ్డూలు
ఇక తిరుమల శ్రీవారి లడ్డును తయారు చేయడం కోసం పలాస జీడిపప్పును ఉపయోగిస్తారు. మంచి క్వాలిటీ పదార్థాలతో, ఆవు నెయ్యితో శ్రీవారి లడ్డూలు తయారు చేస్తారు.శనగపిండి, చక్కెర, జీడిపప్పు, ఎండుద్రాక్ష, కలకండ, యాలుకలు, ఆవు నెయ్యి వీటిని ఉపయోగించి తిరుమల శ్రీవారి లడ్డూలు తయారు చేస్తారు. ప్రతిరోజు శ్రీవారి పోటులో 3 లక్షలకు పైగా లడ్డులు తయారవుతాయి.
తిరుమల శ్రీవారి లడ్డూకు 2009లో పేటెంట్
ఇక 2009 సెప్టెంబర్లో చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేటర్ రిజిస్ట్రీ విభాగం ద్వారా తిరుమల శ్రీవారి లడ్డు పేటెంట్ హక్కులు పొందింది. అంతకుముందు 1999లో జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ చట్టం ప్రకారం జిఐ హక్కులను కూడా సాధించింది. శ్రీవారి లడ్డు అంటే కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక.
స్వామికి ప్రేమపాత్రం, భక్తులకు పరమ ఇష్టం
భక్తుల మనోభావాలకు, స్వామి ప్రసాదం పట్ల భక్తులకు ఉన్న నమ్మకానికి ఇది అద్దం పడుతుంది. 1715 లో ప్రారంభమైన ఈ లడ్డు ప్రస్థానం నిన్నటితో 310 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. స్వామికి ప్రీతిపాత్రమైనదిగా, భక్తులందరికీ పరమ ఇష్టమైనదిగా తిరుమల లడ్డు ప్రసాదం తన రుచితో అందరినీ ఆకట్టుకుంటుంది.












Click it and Unblock the Notifications