తిరుమల లడ్డూ ఆరోపణల మధ్య జగన్ అనూహ్యం

YS Jagan letter to PM Modi: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వాడిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చెలరేగుతున్న దుమారం తగ్గట్లేదు. చంద్రబాబు వ్యాఖ్యల అనంతరం చోటు చేసుకుంటోన్న పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోన్నాయి.

కలియుగ వైకుంఠంలా అలరారుతున్న, సాక్షాత్ శ్రీమహావిష్ణువే కొలువుదీరిన తిరుమలపై, అక్కడి పవిత్రతపై, స్వామివారి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగడం అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోట్లాదిమంది హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల అటు జాతీయ మీడియా సైతం దీనికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది.

Tirumala Laddu row YS Jagan writes to PM Modi

ఈ పరిణామాల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామాలన్నింటినీ వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఎనిమిది పేజీలు ఉన్న సుదీర్ఘ లేఖ ఇది. ఇందులో అనేక అంశాలను ప్రస్తావించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను ధ్వంసం చేసేలా, ఆలయ ప్రాధాన్యతను తగ్గించేలా చంద్రబాబు వ్యవహరిస్తోన్నారంటూ వైఎస్ జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. శ్రీవారికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులు ఉన్నారని, ఎంతో సున్నితమైన ఈ అంశాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోన్నారంటూ విమర్శించారు.

100 రోజుల్లోనే చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయట్లేదని చెప్పారు. ఈ వ్యతిరేకత నుంచి బయటపడటానికి డైవర్షన్ పాలిటిక్స్‌ను తెరమీదికి తీసుకొచ్చారని వైఎస్ జగన్ ఆరోపించారు.

ఇందులో భాగంగానే- తిరుమల, తిరుమల ఆలయం, శ్రీవారి లడ్డూ ప్రసాదం వంటి అత్యంత పవిత్రమైన, కోట్లాదిమంది హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాలపై పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని చెప్పారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వాడుతున్నారనే అసత్యాలను ప్రచారం చేస్తోన్నారని, దీనివల్ల ఆలయ పవిత్రతను దెబ్బతీస్తోన్నారని అన్నారు.

ల్యాబ్ రిపోర్ట్‌లోని అంశాలను వైఎస్ జగన్.. ఈ లేఖలో వివరించారు. జూన్ 4వ తేదీన రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, జులై 12వ తేదీన నెయ్యి శాంపిల్స్ తీసుకున్నారని, అందులో జంతువుల కొవ్వు కలిసి ఉందంటూ రిపోర్ట్ రావడంతో టీటీడీ దాన్ని లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించలేదని వివరించారు.

అయినప్పటికీ- చంద్రబాబు తన అసత్య ప్రచారాలను మాత్రం మానుకోలేదని జగన్ చెప్పారు. శ్రీవేంకటేశ్వరస్వామివారి ప్రసాదాల తయారీలో టీటీడీ దశాబ్దాల కాలంగా నియమ, నిబంధనలను అనుసరిస్తోందని గుర్తు చేశారు. కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిఫారసు చేసిన ప్రముఖులను టీటీడీ పాలక మండలిలో సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు.

ఇప్పుడున్న టీటీడీ బోర్డులో కూడా కొందరు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారని జగన్ తెలిపారు. స్వతంత్రంగా వ్యవహరించే పాలక మండలి కావడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం ఇందులో నామమాత్రంగా ఉంటుందని, పాలక మండలి భక్తుల ప్రయోజనాల కోసం సొంతంగా నిర్ణయాలను తీసుకుంటుందని చెప్పారు.

శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం వినియోగించే నెయ్యిని ఇ-టెండరింగ్ ప్రక్రియ ద్వారా సేకరిస్తుంటారని, ప్రతి ఆరు నెలలకోసారి ఈ టెండర్ల ప్రాసెస్‌ను చేపడుతుంటారని జగన్ వివరించారు. తక్కువ ధరను కోట్ చేసిన కాంట్రాక్టర్‌కు నెయ్యిని సరఫరా చేసే బాధ్యతను అప్పగించడం బిడ్డింగ్‌ నిబంధనల్లో ఉందని అన్నారు.

2014- 2019 మధ్యకాలంలో సహా దశాబ్దాల కాలంగా ఇదే ప్రక్రియ కొనసాగుతోందని జగన్ తెలిపారు. నెయ్యి ప్యూరిటీకి సంబంధించిన సర్టిఫికెట్‌ను ప్రతి ట్యాంకర్‌కు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీ అందజేస్తుంటుందని అన్నారు.

ఆ తరువాత ప్రతి ట్యాంకర్ నుంచి మూడు శాంపిళ్లను టీటీడీ ఆలయం వద్ద సేకరిస్తారని, ఆ టెస్టుల్లో నెయ్యి శుద్ధమైనదేనని తేలిన తరువాత ప్రసాదాల తయారీకి వినియోగిస్తారని మోదీకి వివరించారు వైఎస్ జగన్. ఈ మూడింట్లో ఏ ఒక్క శాంపిల్ కూడా నెగెటివ్‌గా రిపోర్ట్ వస్తే ట్యాంకర్ మొత్తాన్నీ వెనక్కి పంపిస్తారని, ఆ నెయ్యిని ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించబోరని అన్నారు.

2014-19 మధ్యకాలంలో 15 సార్లు, తమ ప్రభుత్వ హయాంలో అంటే 2019 నుంచి 2024లో 18 సార్లు అలా నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపించినట్లు జగన్ స్పష్టం చేశారు. రెండు నెలల కిందట కూడా ట్యాంకర్లను తిప్పి పంపిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు ఎన్డీడీబీ కాల్ఫ్ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అన్నారు.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2015- 2018 మధ్యకాలంలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్.. తిరుమలకు నెయ్యి సరఫరాను నిలిపివేసిందని వైఎస్ జగన్ గుర్తు చేశారు. అప్పట్లో ప్రైవేటు సంస్థలే నెయ్యిని టీటీడీకి సరఫరా చేశాయని అన్నారు. అదేవిధంగా తమ ప్రభుత్వ హయాంలోనూ కొన్ని రోజులు కేఎంఎఫ్ నెయ్యిని పంపించలేదని పేర్కొన్నారు.

తనకు బాగా అలవాటైన రీతిలో చంద్రబాబు చివరికి తిరుమలను సైతం తన రాజకీయాల కోసం వాడుకుంటోన్నారని, ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్లుగా వ్యవహరించట్లేదని జగన్ ఆరోపించారు. ఈ కీలక పరిస్థితుల్లో దేశం మొత్తం కూడా మీ వైపే చూస్తోందని, చంద్రబాబు ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలను వెలికి తీయాలని దేశ ప్రజలు కోరుకుంటోన్నారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+