Tirumala: షాకిచ్చిన టీటీడీ.. నేటి నుంచి వారికి ఆ అవకాశం లేదు..!
తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్టీసీ, టూరిజం ట్రావెల్స్ కు షాకిచ్చింది. టూరిజం, ట్రావెల్స్ ప్యాకేజీలపై తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే పర్యాటకులు, భక్తులకు ఆదివారం నుంచి దర్శనానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఆర్టీసీకి సమాచారం ఇచ్చింది. ఒక తెలంగాణే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్యాకేజీ పర్యాటకులకు అనుమతి లేదని టీటీడీ బోర్డు పేర్కొంది. టూరిజం, ట్రావెల్స్ ప్యాకేజీల్లో వచ్చే భక్తులు సాధారణ భక్తుల మాదిరిగానే స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రకటించింది.
ఈ నిర్ణయంతో ఆర్టీసీ, టూరిజం శాఖకు ఇది ఎదురు దెబ్బగా భావించవచ్చు. టీటీడీ నిర్ణయం ప్రైవేట్ ట్రావెల్స్ ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి రోజు రెండు బస్సులు వెళ్తాయి. శుక్రవారాల్లో వీటి సంఖ్య పెరుగుతుంది. టూరిజం, ట్రావెల్స్ ప్యాకేజీలకు అనుమతితో భక్తులకు త్వరగా దర్శనం అయ్యేది. దర్శన టికెట్ల దందా, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని బోర్డు దృష్టికి వచ్చింది. దీనిపై చర్చించిన బోర్డు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ పై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రతి రోజు ట్రావెల్స్ తో వెయ్యి నుంచి 2వేల మంది వరకు తిరుపతికి వెళ్తుంటారని చెబుతున్నారు. అయితే టీటీడీ బోర్డు ప్రత్యేక దర్శనాలు నిలిపి వేయడంతో ఉపాధి దెబ్బతింటుందని ట్రావెల్స్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ నిర్ణయంతో బస్సులకు ఈఎంఐలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంటుందని ఆవేదనగా ఉన్నారు. టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు మూడు రోజుల తిరుపతి టూర్ లో భాగంగా తిరుపతి, తిరుమల, తిరుచానూరు తీసుకెళ్తారు.
హైదరాబాద్ లో సాయంత్రం 5.30 గంటలకు బస్సు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.00 గంటల వరకు తిరుపతికి వెళ్తుంది. పర్యాటకులకు స్వామివారి శ్రీఘదర్శనం చేయిస్తారు. తర్వాత మిగతా ప్రాంతాలకు తీసుకెళ్లి తిరిగి హైదరాబాద్ బయల్దేరుతారు. అయితే టూర్స్ అండ్ ట్రావెల్లో కొందరు టికెట్ల దందా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కువ మందికి టికెట్లు బుక్ చేసి తక్కువ మందిని అక్కడి తీసుకెళ్లి మిగతా టికెట్లు అమ్ముకుంటున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. అందుకే టీటీడీ టూరిజం, ట్రావెల్స్ ప్యాకేజీలపై దర్శనాలను నిలిపివేసింది.












Click it and Unblock the Notifications