చంద్రబాబునాయుడి ప్రాణ స్నేహితుడు మృతి
తిరుపతి మున్సిపల్ మాజీ చైర్మన్ కందాటి శంకర్ రెడ్డి మృతిచెందారు
చంద్రబాబు ప్రాణ స్నేహితుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తిరుపతి మున్సిపల్ మాజీ ఛైర్మన్ కందాటి శంకర్‌రెడ్డి మృతిచెందారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం శంకర్ రెడ్డి గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్నారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతూ మరణించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు శంకర్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. స్థానిక బైపాస్ రోడ్డులోని శంకర్ రెడ్డి పార్థివ దేహాన్ని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ మంత్రి పరసా రత్నంతోపాటు టీడీపీ నేతలు పలువురు శంకర్ రెడ్డికి నివాళులర్పించారు.
శంకర్‌రెడ్డి మృతి తనను కలిచివేసిందని, పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేసిన శంకర్ రెడ్డి సేవలు చిరస్మరణీయమని చంద్రబాబు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానన్నారు. యూనివర్సిటీ స్థాయి నుంచి తమ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేదని, తిరుపతి మున్సిపాలిటీ ఛైర్మన్‌గా కందాటి తన బాధ్యతలు అత్యంత సమర్థవంతంగా నిర్వహించారంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఓదార్చారు.

చంద్రబాబు, శంకర్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో.. ఇద్దరూ కలిసి ఒకే హాస్టల్‌లో ఉండేవారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. శంకర్ రెడ్డి 2002లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి మున్సిపల్ ఛైర్మన్ అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి కరుణాకర్‌రెడ్డిపై గెలుపొందారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పుత్తూరు నియోజకవర్గం నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడు చేతిలో ఓటమిపాలయ్యారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి మరోసారి ఓటమిపాలయ్యారు. కొంతకాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న శంకర్ రెడ్డి గత ఎన్నికల సమయంలో తిరుపతి టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ తరఫున ప్రచారాన్ని నిర్వహించారు.
తిరుపతి మున్సిపల్ మాజీ ఛైర్మన్ కందాటి శంకర్ రెడ్డి గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేసిన శంకర్ రెడ్డి గారి సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/jiB82D2AbM
— N Chandrababu Naidu (@ncbn) February 5, 2023












Click it and Unblock the Notifications