వైఎస్ షర్మిల స్ట్రాటజీ రాంగ్-టికెట్లు అమ్ముకున్నారు-చింతామోహన్ షాకింగ్ కామెంట్స్..!
ఏపీ విభజన తర్వాత ఎన్నికల్లో గెలుపోటముల్ని మర్చిపోయి పోటీ చేసేందుకు అభ్యర్ధులే కరవైన కాంగ్రెస్ పార్టీ ఈసారి వైఎస్ షర్మిలను పార్టీలో చేర్చుకుని పీసీసీ పగ్గాల్ని అందించింది. షర్మిలను పూర్తిగా నమ్మి ఎన్నికల్లో ఫ్రీహ్యాండ్ ఇచ్చింది. అయితే షర్మిల చేసిందేమీ లేదా, ఇంకా చెప్పాలంటే ఆమె తప్పిదాలతో కాంగ్రెస్ మరోసారి నష్టపోతోందా అంటే అవుననే అంటున్నారు పార్టీ సీనియర్ నేత, తిరుపతి లోక్ సభ అభ్యర్ధి చింతామోహన్.
ఈసారి ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ షర్మిల తప్పిదాలతో నష్టపోయిందంటూ తిరుపతి ఎంపీ అభ్యర్ధి చింతా మోహన్ ఇవాళ ఆరోపించారు. ఆరునెలల క్రితం కాంగ్రెస్ పునర్‌వైభవం సాధిస్తుందని ఆశించామన్నారు. కానీ కొన్ని పొరబాట్ల వల్ల ఆశించినంత ప్రయోజనం కలగలేదన్నారు. కనీసం 5-10 అసెంబ్లీ సీట్లు, 2-5 ఎంపీ సీట్లు గెలుస్తామని భావించినట్లు చింతా మోహన్ తెలిపారు. కానీ తమ స్ట్రాటజీలో తప్పు వచ్చిందన్నారు.

పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల స్ట్రాటజీ రాంగ్ అని, ఆమె అట్లా చేసి ఉండకూడదని చింతా మోహన్ వ్యాఖ్యానించారు. అందరినీ కలుపుకుని వెళ్లి ఉంటే బావుండేదన్నారు. 175 స్ధానాల్లో రాజకీయ కమిటీలు ఉన్నా వారితో షర్మిల మాట్లాడలేదన్నారు.మాట్లాడినా కేవలం 3 నిమిషాలే మాట్లాడిందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా టికెట్లు ఇవ్వలేదని, ఇది వాస్తవం అని ఆరోపించారు.దీనిపై మిగిలిన వాళ్లు మాట్లాడలేకపోతున్నారన్నారు. ఇది రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదని, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని వైఎస్ షర్మిలకు ఆయన గుర్తుచేశారు.
ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదని చింతా మోహన్ ఆరోపించారు. టికెట్ల విషయంలో డబ్పులు మారాయని అంతా అనుకుంటున్నారని, ఎవరు తీసుకున్నారో తెలియదన్నారు. మరోవైపు ఈసారి రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ఓడిపోవడం ఖాయమన్నారు.












Click it and Unblock the Notifications