ఉచిత బస్సుకు షరతులేంటి ? అన్ని సర్వీసుల్లో అనుమతించాల్సిందే..!
ఏపీలో మహిళలకు ఆగస్టు 15 నుంచి 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. స్త్రీశక్తి పథకం పేరుతో దీన్ని అమలు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం తాజాగా కేబినెట్లో ఆమోదించింది. అయితే ఇందులో కేవలం 5 రకాల బస్సుల్లోనే, పరిమిత రూట్లలోనే అనుమతించాలని తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలకు ముందు షరతుల్లేకుండా ఉచిత బస్సు ప్రయాణం అనుమతిస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పారన్న చర్చ జరుగుతోంది.
ఇదే అంశంపై తిరుపతి వైసీపీ మేయర్ శిరీష ఇవాళ స్పందించారు. ఫ్రీ బస్సు పథకం పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని, ఏసీ బస్సుల్లో సైతం మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించాలని శిరీష డిమాండ్ చేశారు. ఫ్రీ బస్సు పేరుతో మహిళలను మోసం చేస్తే ఊరుకోమని ఆమె హెచ్చరించారు. 2 కోట్ల మహిళల ఓట్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా ఎన్నికలకు ముందు మహిళలకు భారీగా హామీలు గుప్పించిన కూటమి నాయకులు, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్నారని మేయర్ ఆరోపించారు.

ఇప్పటికే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం పథకాల పేరుతో చేసిన మోసం చాలదన్నట్టు, ఫ్రీ బస్సు హామీని కూడా తూతూమంత్రంగా అమలు చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నట్టు కనపడుతోందని శిరీష ఆరోపించారు. ేకూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని, కండక్టర్ ఏదైనా అడిగితే చంద్రన్న పేరు చెప్పండి,, నేనే సేఫ్ డ్రైవర్ని అని ఎన్నికలకు ముందు చంద్రబాబు పదే పదే చెప్పుకున్నారని గుర్తుచేశారు.

LIVE: Tirupati Mayor Smt. Dr. Sirisha Press Meet https://t.co/3NbOkeEqh5
— YSR Congress Party (@YSRCParty) August 8, 2025
కానీ ఏడాది తర్వాత ఫ్రీబస్సు పథకాన్ని అమలు చేస్తూ కూడా కేవలం 5 రకాల బస్సుల్లో మాత్రమే ఉచితంగా ప్రయాణించే అవకాశం ఇచ్చారంటే ఆయన్ను ఏమనాలని ప్రశ్నించారు. ఇది మోసం కాదా అన్నారు. రాష్ట్రంలో ఏ పుణ్యక్షేత్రానికైనా ఆర్టీసీ బస్సుల్లో రూపాయి చార్జీ లేకుండా ప్రయాణించవచ్చని చెప్పారని, 40 కిమీల పరిధిలో మాత్రమే తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో తిరుపతి నుంచి సింహాచలం ఎలా వెళ్లాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 12 వేల ఆర్టీసీ బస్సులు తిరుగుతుంటే కేవలం 50 శాతం బస్సుల్లోనే ఫ్రీ బస్సు పథకం అమలు చేయడం మోసం కాదా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications