Tirupati: తిరుపతికి కేంద్రం గుడ్ న్యూస్-ఇక అంతా అక్కడే..!
ఏపీలో ప్రస్తుతం డేటా సెంటర్ల (data centre)హవా నడుస్తోంది. విశాఖపట్నం కేంద్రంగా గతేడాది గూగుల్ డేటా సెంటర్ రాకతో మొదలైన ఈ సందడి ఇప్పుడు తిరుపతి (Tirupati)వరకూ విస్తరించింది. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో కేంద్రం సాయంతో కొత్తగా ఓ క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. ప్రస్తుతం మంగళగిరిలో రాష్ట్ర డేటా సెంటర్ ఉంది. ఇందులోనే రాష్ట్ర ప్రజల పూర్తి వివరాలను ప్రభుత్వం స్టోర్ చేస్తోంది. ఇప్పుడు దానికి బ్యాకప్ గా తిరుపతిలో ఈ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది.
రాష్ట్రంలో ప్రజల ఆధార్ వివరాలు, భూముల రిజిస్ట్రేషన్ పత్రాలు, ఆస్పత్రుల రికార్డులు, మీ సేవ కేంద్రాలకు వచ్చే డేటా.. ఇలా ప్రతీ సమాచారాన్నీ ప్రభుత్వం మంగళగిరిలోని ప్రధాన డేటా సెంటర్ లో భద్ర పరుస్తోంది. అయితే ఇక్కడ భవిష్యత్తులో సాంకేతిక సమస్యలు తలెత్తినా, డేటా చౌర్యం జరిగినా, ఏదైనా విపత్తులు వచ్చినా ఇబ్బందులు లేకుండా బ్యాకప్ గా రాష్ట్ర విపత్తుల రికవరీ సెంటర్ పేరుతో తిరుపతిలో కొత్త డేటా సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దీంతో కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.194.60 కోట్లతో తిరుపతిలో కొత్తగా క్లౌడ్ డేటా కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బూట్ మోడల్ లో ఏర్పాటు చేసే ఈ డేటా సెంటర్ వల్ల శ్రీసిటీలోని ప్రైవేటు, ఐటీ, కార్పోరేట్ సంస్థలకు, అలాగే నాయుడుపేటలోని పారిశ్రామికవాడలకూ ఉపయోగం ఉంటుంది. అలాగే ప్రభుత్వ వెబ్ సైట్ల డేటా నిర్వహణ, ఇతర అవసరాలూ తీరబోతున్నాయి. తిరుపతిలోని రేణిగుంట రోడ్డులో ఉన్న ఐఐటీడీ క్యాంపస్ ఐటీ పార్క్ లో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు.












Click it and Unblock the Notifications