నేడే క్రిస్మస్: అందంగా ముస్తాబైన చర్చీలు; అర్దరాత్రి నుండే వేడుకలు!!
క్రైస్తవులు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో ప్రధానమైన పండుగ క్రిస్మస్ పండుగ. నేడు ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ ఘనంగా జరుపుకుంటున్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని మన దేశంలోనూ చర్చీలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. చర్చిల నిర్వాహకులు రకరకాల విద్యుత్ దీపాలంకరణలతో చర్చిలను అందంగా అలంకరించారు. క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు.
అంతేకాదు చర్చిల ఆవరణలో ఏసుక్రీస్తు జననానికి సంబంధించిన ప్రతిమలను ఏర్పాటు చేసి ప్రదర్శనలను పెట్టారు. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఏసుక్రీస్తు బోధనలను బిషప్ లు, పాస్టర్లు భక్తులకు దైవ సందేశాన్ని వినిపించి ఉపదేశం చేయనున్నారు. దేశ వ్యాప్తంగా మంత్రులు, రాజకీయ ప్రముఖులు వివిధ చర్చీలలో క్రైస్తవులతో కలిసి సామూహిక ప్రార్ధనలలో పాల్గొననున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ సీఎస్ఐ చర్చి నేటితో 100 వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ చర్చి ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్ద చర్చ్. ప్రపంచంలో వాటికన్ చర్చ్ తర్వాత అతి పెద్దదైన ఈ చర్చ్ నిర్మాణం చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం అర్ధరాత్రి నుంచి క్రిస్మస్ ట్రీ లు, స్టార్లతో సందడి వాతావరణం కనిపిస్తుంది.
క్రిస్మస్ పండుగ సందర్భంగా షాపింగ్ చేసే వారితో వస్త్ర దుకాణాలు, స్వీట్ షాపులు, కేక్ తయారీ కేంద్రాల వద్ద విపరీతమైన రద్దీ కనిపించింది. క్రిస్మస్ పండుగకు సంబంధించిన ఆచారాలు చాలా సరదాగా మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తాయి . క్రిస్మస్ సాధారణంగా అర్ధరాత్రి ప్రారంభమవుతుంది. ఏసుక్రీస్తు అర్దరాత్రి సమయంలో పుట్టారు అన్న కారణంగా ప్రతి చర్చిలలోనూ అర్థరాత్రి నుండి సందడి మొదలవుతుంది.
క్రిస్మస్ పండుగ సందర్భంగా బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం కూడా ఎప్పటినుంచో ఉన్న ఆనవాయితీ. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎరుపు రంగు దుస్తులతో, అందమైన తెల్లని గడ్డంతో శాంతా క్లాస్ చేసే సందడి అంతా ఇంతా కాదు. మొత్తంగా ప్రపంచమంతా జరుపుకునే సంబరాల వేడుకగా ఏసుక్రీస్తు జన్మించిన పుణ్య దినం క్రిస్మస్ పండుగ నేడు కనువిందు చేస్తుంది.












Click it and Unblock the Notifications