మీ చేతుల్లో రాష్ట్రం సురక్షితం: వైఎస్ జగన్‌కు నటుడు కైకాల సత్యనారాయణ భావోద్వేగ లేఖ
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ లేఖ రాశారు. తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ, సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. ముఖ్యమంత్రిగా పరిపాలనలో తీరిక లేని సమయంలోనూ తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించారని పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ ఫోన్ చేసి.. ధైర్యం చెప్పారని సత్యనారాయణ గుర్తు చేశారు.

క్లిష్ట సమయంలో కుటుంబానికి అండగా..
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు తాను చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వచ్చి.. బాగోగులను చూసుకున్నారని కైకాల అన్నారు. తన కుటుంబ సభ్యులకు అండగా నిలిచారని చెప్పారు. వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వమే అందజేసిందని పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్లిష్ట పరిస్థితుల్లో వైఎస్ జగన్ తన కుటుంబానికి అండగా నిలవడం.. నైతిక బలాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందని కైకాల సత్యనారాయణ అన్నారు.
రాష్ట్రం మంచి చేతుల్లో
తన ఆరోగ్యం, కుటుంబం పట్ల చూపించిన శ్రద్ధ.. కళాకారులపై వైఎస్ జగన్‌కు ఉన్న ప్రేమాభిమానాలు, ఆప్యాయతలను మరోసారి రుజువు చేసిందని చెప్పారు. కళాకారులు, ప్రజల పట్ల ఉన్న శ్రద్ధ.. రాష్ట్రం మంచి చేతుల్లో సురక్షితంగా ఉందనే భరోసాను మరోసారి ఇచ్చినట్టయిందని కైకాల సత్యనారాయణ అన్నారు. వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరం, సంక్రాంతి పండగ శుభాకాంక్షలను తెలియజేశారాయన. ఈ లేఖపై తాను సంతకం చేయలేకపోతున్నానని, తన కుమారుడు సంతకం చేశారనీ పేర్కొన్నారు.

ఫోన్ చేసిన వైఎస్ జగన్..
కైకాల సత్యనారాయణ.. కొద్ది రోజుల కిందట తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందారు. కోలుకున్నారు. ఆరోగ్యంతో ఇంటికి తిరిగొచ్చారు. ఆ సమయంలో వైఎస్ జగన్ కైకాల కుటుంబ సభ్యులకు స్వయంగా ఫోన్ చేశారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు. చికిత్స కోసం అయిన ఖర్చును భరిస్తామని హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా సత్యనారాయణ చికిత్స కోసం అయిన ఖర్చును ప్రభుత్వమే భరించింది.

కత్తి మహేష్ చికిత్స కోసం..
ఇదివరకు కత్తి మహేష్, సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆసుపత్రి బిల్లులను కూడా ఏపీ ప్రభుత్వమే భరించిన విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లాలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ తీవ్రంగా గాయపడి.. చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అప్పట్లో ఆయన వైద్య ఖర్చుల కోసం ఏపీ ప్రభుత్వం 17 లక్షల రూపాయలను చెల్లించింది. ప్రఖ్యాత సినీ గేయ రచయిత, దివంగత సిరివెన్నెల సీతారామ శాస్త్రి.. అనారోగ్యానికి గురై కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు కూడా ఏపీ ప్రభుత్వం బిల్లులను చెల్లించింది.

సిరివెన్నెల కుటుంబానికీ..
సిరివెన్నెల కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో కట్టిన అడ్వాన్స్ మొత్తాన్ని కూడా తిరిగి ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం అప్పట్లో చర్యలు తీసుకుంది. కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కష్టకాలంలో వైఎస్ జగన్ తమ కుటుంబానికి వెన్నుదన్నుగా ఉన్నారంటూ సిరివెన్నెల కుమారుడు సాయి యోగేశ్వర్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అప్పట్లో ఆయన కూడా ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు.












Click it and Unblock the Notifications