రాజ్యసభకు వీరే!, వైసిపి ఎమ్మెల్యేలు చేయిస్తే.. బాబు డైలమా: మాటపై నిలబడ్డ జగన్
విజయవాడ: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి, మాజీ ఎమ్మెల్యే హేమలతల పేర్లకు చంద్రబాబు పచ్చజెండా ఊపినట్లుగా తెలుస్తోంది. మూడో సీటు బీజేపీకి ఇచ్చే ఉద్దేశ్యంతో ఎవరినీ ఖరారు చేయలేదని తెలుస్తోంది.
అయితే, బీజేపీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని స్వయంగా చంద్రబాబు రెండు రోజుల క్రితం చెప్పారు. మంగళవారం నాడు అసోం ముఖ్యమంత్రిగా శరబానంద సోనోవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానంతో రాజ్యసభ అంశం చర్చకు వచ్చి ఉండి ఉంటుందని అంటున్నారు. మూడో అభ్యర్థిగా బీజేపీ నేత, ప్రస్తుత కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు అవకాశం ఇస్తారనే వాదనలు ఉన్నాయి. అందుకే మూడో పేరును టిడిపి తరఫున బాబు ఖరారు చేయలేదని అంటున్నారు.

మూడో అభ్యర్థి కోసం తెలంగాణ టిడిపి నేతల ఆశలు
ఇప్పటి వరకు బీజేపీ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని తెలుస్తోంది. బీజేపీ నుంచి ప్రతిపాదన రాకుంటే.. ఏం చేయాలనే ఆలోచన కూడా చంద్రబాబు చేస్తున్నారని తెలుస్తోంది. మూడో రాజ్యసభ స్థానం కోసం తెలంగాణ టిడిపి నేతలతో పాటు ఏపీలోను పెద్ద ఎత్తున పోటీ నెలకొంది.
అంతేకాదు, అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనందున.. మొదటి రెండు స్థానాలకు కూడా ఏపీలో గట్టి పోటీయే ఉంది. చివరి నిమిషంలో మార్చినా మార్చవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ చంద్రబాబు రెండు పేర్లు ఫైనల్ చేశారని మరికొందరు అంటున్నారు.
సుజనా చౌదరి, హేమలత పేర్లు ఖరారయినప్పటికీ.. ఇంకా రేసులో పలువురు ఉన్నారు. టిజి వెంకటేష్, ఫరూక్, డొక్కా మాణిక్య వరప్రసాద్, పుష్పరాజ్ తదితరులు ఉన్నారు. మరోవైపు, ప్రస్తుత టిడిపి బలం ప్రకారం నాలుగో స్థానాన్ని టిడిపి గెలుచుకోంది.
వైసిపి ఎమ్మెల్యేలు తమ అభ్యర్థికి ఓటు వేస్తేనే గెలిచే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగో స్థానంలో పోటీ పెట్టాలా? వైసిపికి చెందిన ఎమ్మెల్యేలు మన వైపు మొగ్గు చూపుతారా? చూపితే ఎందరు చూపుతారు? అనే చర్చ టిడిపిలో సాగుతోంది. నాలుగో సీటు కోసం పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం కన్నా పోటీ చేయకపోవడమే మంచిదని కొందరు సూచిస్తున్నారని తెలుస్తోంది.
రేపు విజయ సాయి రెడ్డి నామినేషన్
రెండేళ్ల క్రితం ఇచ్చిన మాటను వైసిపి అధినేత జగన్ నిలబెట్టుకున్నారు. పార్టీ తరఫున రాజ్యసభకు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డిని పంపిస్తామని జగన్ అన్నారు. పార్టీ తరఫున రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థిగా విజయ సాయిని మంగళవారం జగన్ ఖరారు చేశారు.
దీంతో రేపు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. విజయ సాయిని వెంటబెట్టుకుని అసెంబ్లీకి వెళ్లనున్న జగన్... ఆయనతో నామినేషన్ వేయిస్తారని తెలుస్తోంది. కాగా, ఈ నెలాఖరున రాజ్యసభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగియనుంది.
తెలంగాణ నేత మోత్కుపల్లి నర్సింహులు బుధవారం ఉదయం ఏపీ సీఎం చంద్రబాబును కలిసి రాజ్యసభకు తనను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఆలోచిద్దామని చంద్రబాబు చెప్పారు. అయితే, తెలంగాణ నేతలకు మాత్రం రాజ్యసభ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications