బుగ్గన జోరుకు కోట్ల బ్రేక్ వేస్తారా ? హైప్రొఫైల్ డోన్ సీటులో చరిత్ర ఇదే..!
ఏపీలో నంద్యాల లోక్ సభ సీటు పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సీట్లలో డోన్ నియోజకవర్గం కూడా ఒకటి. వీఐపీ, హైప్రొఫైల్ నియోజకవర్గంగా దీనికి పేరుంది. దీనికి కారణం గతంలో భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, మాజీ సీఎం కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా పనిచేసిన కేఈ కృష్ణమూర్తి వంటి వారు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. గత రెండు దఫాలుగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వరుసగా గెలిచారు. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం రంగంలో ఉన్నారు.
నంద్యాల లోక్ సభ పరిధిలోని జనరల్ సీటు డోన్ అసెంబ్లీ నియోజకవర్గం. బేతంచర్ల, డోన్, ప్యాపిలి మండలాలు ఇందులో ఉన్నాయి. రెండు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. జనాభా పరంగా చూస్తే బోయలు ఎక్కువ. ఆ తర్వాత ముస్లింలు, యాదవ, మాదిగ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. రాజకీయంగా చూస్తే రెడ్లకూ, గౌడ-ఈడిగ వర్గాలకు మధ్య పోరు కొనసాగుతుంటుంది. 1962లో నీలం సంజీవరెడ్డి, 1994లో కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇక్కడి నుంచి గెలిచి అత్యున్నత పదవులు అలంకరించారు.

టీడీపీ ఆవిర్భావానికి ముందు డోన్ సీటుకు ఆరుసార్లు ఎన్నికలు జరిగితే ఇందులో రెండుసార్లు (1952, 1955) ఇండిపెండెంట్లు, ఓసారి (1967) స్వతంత్ర పార్టీ, మిగిలిన మూడు ఎన్నికలలో (1962, 1972, 1978) కాంగ్రెస్ గెలిచాయి. టీడీపీ ఆవిర్భావం తర్వాత 9 ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ నాలుగు సార్లు (1983, 1989, 1994, 2004), టీడీపీ మూడు సార్లు ( 1985, 1999, 2009), వైసీపీ రెండుసార్లు (2014, 2019) గెలిచాయి.
గతంలో కేఈ కృష్ణమూర్తి, కోట్ల కుటుంబాల మధ్య ఇక్కడ ఎక్కువగా పోటీ ఉండేది. 2009లో చివరి సారిగా కాంగ్రెస్ అభ్యర్ధిగా పటీ చేసిన కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి కోడలు సుజాతమ్మపై టీడీపీ అభ్యర్ధి కేఈ కృష్ణమూర్తి గెలిచారు. ఆ తర్వాత రెండుసార్లు టీడీపీ అభ్యర్ధులపై బుగ్గనే విజయం సాధించారు. దీంతో ఇప్పుటు గట్టిపోటీ ఇచ్చేందుకు తిరిగి కోట్ల కుమారుడు జయసూర్యప్రకాష్ రెడ్డిని టీడీపీ బరిలోకి దించింది. అయితే ఆర్ధికమంత్రిగా, సౌమ్యుడిగా బుగ్గనకు ఉన్న మంచిపేరు మరోసారి ఆయనకు కలిసి రావొచ్చని అంచనా. కోట్ల కుటుంబ చరిత్ర, జనసేన పొత్తుల్ని టీడీపీ నమ్ముకుంది.












Click it and Unblock the Notifications