కృష్ణా జిల్లాలో తీవ్రవిషాదం.. నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు బాలురు మృతి
శ్రీరామనవమి పండుగ నాడు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నదిలో స్నానానికి వెళ్ళిన ముగ్గురు బాలురు తిరిగి రాని లోకాలకు వెళ్లారు. చనిపోయిన ముగ్గురు అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఈ విషాద ఘటనతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమునీరుగా విలపిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పండుగ సందర్భంగా ఈరోజు ఉదయం మత్తి వెంకట గోపి కిరణ్(15), ఎం. వీరబాబు(15), ఎం.వర్ధన్(16) కృష్ణా నదిలో స్నానానికి దిగి గల్లంతయ్యారు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ యువ కుమార్, ఎస్‌ఐ శ్రీనివాసులు గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే కొంతసేపటికి ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ అనూహ్య ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలుర కుటుంబ సభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. పండుగ పూట ఆనందంగా గడపాల్సిన చిన్నారుల ఇలా చనిపోవడం పట్ల దుఖంలో మునిగిపోయారు.












Click it and Unblock the Notifications