మూడు నెలలకే...మూడు ముళ్ల బంధం ముగిసింది.... భర్త కళ్లెదుటే నవవధువు కన్నుమూత...
చిత్తూరు జిల్లా: పెళ్లయి మూడు నెలలన్నా కాలేదు. కానీ ప్రమాదం రూపంలో విధి ఆ నూతన దంపతులను విడదీసింది. ట్రాక్టర్ రూపంలో మృత్యువు కొత్త పెళ్లి కూతురును కబళించింది. భర్త కళ్ల ముందే నవ వధువు కన్నుమూసింది. ఈ ఘటన రెండు రైతు కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని నింపింది. చిత్తూరు జిల్లాలో చోటుచేసుకున్నవిషాద ఘటన ఇది.
చిత్తూరు జిల్లా గంగవరం మండల పరిధిలోని కల్లుపల్లెవాసి శ్రీహరికి, కలగటూరు పంచాయతీ మిట్టిండ్లుకి చెందిన రోజా (22)కు మూడు నెలల క్రితం వివాహమైంది. రైతు కుటుంబానికి చెందిన వీరు పొలం వద్ద ఉన్న వరి గడ్డిని ఇంటికి తరలించేందుకు ట్రాక్టర్‌లో ఉదయాన్నేబయలుదేరారు. శ్రీహరి చినమామ కృష్ణమూర్తి ట్రాక్టర్ నడపగా వెనుక చెక్కలపై భర్త శ్రీహరి, భార్య రోజా కూర్చున్నారు. ఎగుడుదిగుడులుగా ఉన్న పొలాల మధ్య వాహనం వెళుతుండగా పట్టు తప్పిన రోజా హఠాత్తుగా ట్రాక్టర్‌కు, ట్రాలీకి మధ్య ఖాళీ లోకి జారి కిందకు పడిపోయింది.

భర్త గమనించి తేరుకొని ట్రాక్టర్ ఆపమని కేకలు వేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే ట్రాలీ చక్రాలు ఆమె మీదుగా వెళ్లడంతో రోజా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా రోదించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఎస్సై రాజశేఖర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు. అయితే కొత్త జంట ఎంతో అన్యోన్యంగా గడిపేవారని, మూడు నెలలు కూడా కాకుండానే వీరి మూడు ముళ్ల బంధం ముగిసిపోవడం ఘోరమని స్థానికులు విధిని శాపనార్థాలు పెట్టేలా చేసిందీ ఘటన.












Click it and Unblock the Notifications