ఏపీలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా కొందరు ఐపీఎస్ అధికారులకు స్థాన చలనం కలిగింది. మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా నియమించారు. అతుల్ సింగ్‌కు ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌ను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశించారు. శంకబ్రత బాగ్చీకి అగ్నిమాపక శాఖ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. గతంలో చిత్తూరు ఎస్పీగా వ్యవహరించిన రిశాంత్ రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.

ప్రసుత్తం రిశాంత్ రెడ్డి కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఎస్పీగానూ, ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ లోనూ ఉన్నారు. తాజా బదిలీల నేపథ్యంలో, రిశాంత్ రెడ్డిని ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ బాధ్యతల నుంచి తప్పించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, బుధవారం భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగిన విషయం తెలిసిందే. పురపాలక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‍లను జీఏడీక అటాచ్ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో మొత్తం 19 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్‌ను నియమించగా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించింది. వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్‌ను ప్రభుత్వం నియమించింది.
కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేదిని నియమించగా, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్‌కుమార్ సింఘాల్‌కు బాధ్యతలు అప్పగించింది. పౌరసరఫరాలశాఖ కమిషనర్‌గా సిద్ధార్థ్ జైన్‌కు బాధ్యతలు అప్పగించింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్‌ను నియమించగా, పుణ్యాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తుర్వులు జారీ చేసింది.
కోన శశిధర్‌ను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా నియమించడంతో పాటు ఐటీ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఉద్యాన, మత్స్యశాఖ సహకార విభాగాల కార్యదర్శిగా బాబు.ఎ ను నియమించింది. ఆర్థికశాఖ వ్యయ విభాగం కార్యదర్శిగా ఎం.జానకిని నియమించింది. పశుసంవర్ధకశాఖ కార్యదర్శిగా ఎం.ఎం.నాయక్‌కు బాధ్యతలు అప్పగించింది. తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ను గనుల శాఖ కమిషనర్, డైరెక్టర్‌గా నియమించడంతో పాటు ఏపీఎండీసీ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తిరుపతి జాయింట్ కలెక్టర్‌కు జిల్లా కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. సెర్ప్ సీఈవో మురళీధర్‌రెడ్డిని జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలిచ్చింది. ఆర్థికశాఖ కార్యదర్శిగా వి.వినయ్ చంద్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్‌ను నియమించింది. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్నకు బాధ్యతలు అప్పగించింది. మరోవైపు, ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమల రావు నియమితులైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications