చీరాలలో ఠాగూర్ సిన్మా: ఇక్కడ శవాలకు ట్రీట్‌మెంట్‌ చేయబడును

చీరాల : అతను ప్రాణాలు వదిలి రెండ్రోజులయ్యింది...! అయినా అతనికి ట్రీట్‌మెంట్‌ జరిగిపోతోంది...! అతన్ని రక్షించాలని డాక్టర్లు నానా హైరానా పడిపోతున్నారు...! మందులు వాడేస్తున్నారు...! ఇంజక్షన్లు చేసేస్తున్నారు...! ప్రిస్కిప్షన్స్‌ రాసేస్తున్నారు...! క్యాష్‌ కౌంటర్‌ దగ్గర బంధువులు వేలకు వేలు జమ చేస్తున్నారు...! సిస్టర్లు గబగబా అటూఇటూ తిరిగేస్తున్నారు...! మందులు తీసుకురావడం ఆలస్యమైతే ఎలాగంటూ పేషెంట్‌ బంధువుల్ని గదమాయిస్తున్నారు...! అతనంత ప్రాణాపాయంలో ఉంటే ఇంత నత్తనడక నడిస్తే కుదరదంటూ మందలిస్తున్నారు...! ఎలా ఉందండీ మా బంధువుకి? అని అడగబోతే సమాధానం చెప్పడానికి కూడా వీల్లేనంత హడావిడిగా ఉందక్కడి వాతావరణం...! -ఇదంతా చదువుతుంటే ఇదేదో కథలా ఉందనీ... ఇది ఖచ్చితంగా ఠాగూర్‌ సిన్మాలో హాస్పిటల్‌ సీనే అయి ఉంటుందని అనుకుంటున్నారు కదూ...! అవును... ఇది ఆ సిన్మా కథే...! అచ్చం ఇలాంటి దృశ్యమే చీరాల్లోనూ జరిగింది...!

రెండ్రోజుల కిందట పేషెంటు చనిపోయినా ఆ విషయం బంధువులకు చెప్పకుండా డబ్బులు కట్టించుకుని మృతదేహానికి చికిత్స చేశారంటూ చీరాలలోని ఓ ప్రైవేట్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ వద్ద మృతుడి బంధువులు మృతదేహంతో సహా ఆందోళన చేపట్టారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దుపోయేంత వరకూ జరిగిన ఈ ఆందోళనపర్వం అచ్చం ఠాగూర్‌ సిన్మా కథను గుర్తు చేసింది...!

Treatment to dead body at Chirala

బాధితులు అందించిన సమాచారం ప్రకారం - చీరాలకు దగ్గర్లోని వేటపాలెం మండలం పాపాయిపాలెం గ్రామానికి చెందిన గవిని నాగరాజు(30) అనే ఆటోడ్రైవర్‌ వ్యక్తిగత సమస్యలతో గతనెల 20వ తేదీన పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన బంధువులు అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం చీరాల్లోని ఓ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చేర్పించారు. గత 15 రోజులుగా అతనికి ట్రీట్‌మెంట్‌ జరుగుతోంది. రకరకాల మందులూ ఇంజక్షన్లూ వాడారు. ఫలితంలేకపోయింది. మెరుగైన చికిత్స కోసం గుంటూరు తీసుకెళ్ళమంటూ మిగిలిన బకాయి బిల్లులు కట్టించుకుని ఆదరాబాదరా డిశ్చార్జ్‌ చేసేశారు. పేషెంట్‌ ప్రమాద పరిస్థితిలో ఉన్నాడని ఈ ప్రైవేటు వైద్యశాల డాక్టర్లు చెప్పడంతో వీరంతా రోగిని తీసుకుని హుటాహుటిన గుంటూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్ళారు. అక్కడి వైద్యులు చెప్పిన సమాచారం నాగరాజు బంధువుల్ని హతాశుల్ని చేసింది.

మృతదేహానికి వైద్యం ఎలా చేస్తారంటూ ప్రభుత్వ డాక్టర్లు ప్రశ్నించడంతో వీరంతా తెల్లబోయారు. నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారనీ, డాక్టర్లు చెప్పిన విషయం విని వారు కన్నీరుమున్నీరయ్యారన్నారు. రెండురోజుల కిందటే అతను మరణించాడని ప్రభుత్వవైద్యశాల డాక్టర్లు ధృవీకరించారనీ, అనంతరం అక్కడే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని తమకు అప్పగించారని మృతుడి బంధువులు వివరించారు. చీరాల ప్రైవేటు ఆస్పత్రిలో జరిగిన మోసానికి ఆగ్రహం చెందిన నాగరాజు బంధువులు మృతదేహంతో సహా చీరాల చేరుకుని హాస్పిటల్‌ ఎదురుగా మృతదేహంతో ఆందోళన ప్రారంభించారు. వైద్యం పేరుతో ఉన్న డబ్బులన్నీ వసూలు చేసి, ఇక డబ్బులు కట్టలేని పరిస్థితిలో హాస్పిటల్‌ నుంచి పంపించేశారని బంధువులు ఆరోపించారు. ఈ హాస్పిటల్‌ వారు వైద్యం పేరుతో తమ వద్ద నుంచి రూ.లక్షా80వేలు వసూలు చేశారన్నారు. రాజు మృతికి కారణమైన ఈ హాస్పిటల్‌ వైద్యులు అతని భార్యాపిల్లలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

ఈ విషయం తెలిసి స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ హాస్పిటల్‌కు చేరుకుని మృతుని తరఫు బంధువులతోనూ, ఆస్పత్రి వైద్యులతోనూ మాట్లాడా సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. రాజీ పడేందుకు ఇరు వర్గాలూ ససేమిరా అనడంతో చేసేందేంలేక వెనుతిరిగి వెళ్ళిపోయారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పోతుల సునీత ఇరు వర్గాల మధ్య రాజీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో సిఐ బీమానాయక్‌ తన సిబ్బందితో హాస్పిటల్‌కు చేరుకుని ఇరువర్గాలనూ విచారించారు. ఆందోళనకారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. కేసు దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకుంటామనీ, బాధితులకు న్యాయం జరిగేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో నాగరాజు బంధువులు ఆందోళన విరమించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+