తిరుమలలో ట్రయల్ రన్ డెడ్ లైన్: ఉద్యోగులు, విద్యార్థులకు టీటీడీ ఆహ్వానం
తిరుమల క్షేత్ర మహత్యాన్ని, శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య చరిత్రను భక్తులకు కళ్లకు కట్టినట్లు వివరించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం నూతనంగా ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియం ట్రయల్ రన్ కొనసాగుతోంది. అత్యాధునిక డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ మ్యూజియాన్ని నవంబరు 4వ తేదీ వరకు నిర్దేశిత వర్గాల సందర్శన కోసం అందుబాటులో ఉంచినట్లు టీటీడీ వెల్లడించింది.
ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే శ్రీవారి భక్తులకు పూర్తిస్థాయిలో దీనిని ప్రారంభించడానికి ముందుగా ఈ ట్రయల్ రన్ చేపట్టింది. ఈ ట్రయల్ రన్ సమయంలో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మ్యూజియం సందర్శనకు అనుమతి ఇస్తారు. టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, తిరుమల, తిరుపతికి చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక మీడియా ప్రతినిధులు, వారి కుటుంబాలు ఈ మ్యూజియాన్ని సందర్శించవచ్చు.

అలాగే.. శ్రీవారి సేవకులు, టీటీడీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలతో పాటు ఇతర పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ ఎస్వీ మ్యూజియంలో స్వామివారి నిత్య సేవలు, ఉత్సవాల ప్రాశస్త్యాన్ని తెలిపే అరుదైన ఛాయాచిత్రాలు, ప్రాచీన ఆభరణాల నమూనాలు, చారిత్రక నాణేలు, రాగిరేకులు, రాతి శిల్పాలను ప్రదర్శనకు ఉంచారు.
భక్తులకు నూతన తరహా ఆధ్యాత్మిక అనుభూతిని పంచేందుకు వర్చువల్ రియాలిటీ సాంకేతికత, 3డీ ప్రొజెక్షన్ మ్యాపింగ్, ఇంటరాక్టివ్ కియోస్క్, డిజిటల్ స్క్రీన్లను అందుబాటులోకి తెచ్చారు. తిరుమల తిరుపతి చరిత్రను, శ్రీవారి ఆలయ నిర్మాణ శైలిని ప్రతిబింబించే ప్రత్యేక గ్యాలరీలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోన్నాయి.
ప్రస్తుతం చేపట్టిన ఈ ట్రయల్ రన్ ద్వారా మ్యూజియంలో ఏర్పాటు చేసిన వివిధ డిజిటల్ సాంకేతిక పరికరాల పనితీరు, సందర్శకుల రద్దీ నిర్వహణను టీటీడీ పరిశీలిస్తోంది. ప్రదర్శనను తిలకించిన వివిధ వర్గాల నుంచి స్వీకరించే అభిప్రాయాలు, సూచనల ఆధారంగా ఇందులో అవసరమైన చిన్న మార్పులు చేయనున్నారు. ఈ ట్రయల్ రన్ నవంబరు 4వ తేదీతో ముగుస్తుంది. అనంతరం తిరుమలకు విచ్చేసే సామాన్య భక్తులకు మ్యూజియం ప్రవేశాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు వేగవంతం చేస్తుంది.. టీటీడీ.













Click it and Unblock the Notifications
