3 నెలలుగా పాకిస్థాన్ లో బందీగా భారత నేవీ అధికారి..! కేంద్రం సాయం కోరిన ఫ్యామిలీ
ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు చెందిన మర్చంట్ నేవీ అధికారి వినీత్ కిషోర్ మిశ్రా పాకిస్థాన్ లోని కరాచీ పోర్ట్ లో చిక్కుకుపోయారు. ఆయన 6 నెలల కాంట్రాక్ట్ మీద పాకిస్థాన్ లోని కరాచీ పోర్టులో పని చేయడానికి వెళ్లారు. అయితే ఆగస్టు నాటికే కాంట్రాక్ట్ ముగిసింది. దాంతో వినీత్ కిషోర్ మిశ్రా తిరిగి భారత్ కు రావాల్సి ఉంది. కానీ అక్కడి అధికారులు అందుకు అనుమతి ఇవ్వలేదని సమాచారం అందుతోంది. వినీత్ కిషోర్ మిశ్రాతో మరో ఐదుగురు భారతీయలు అలాగే ఆరుగురు ఇరాన్ దేశస్థులు కూడా ఇలానే కరాచీ పోర్టులో చిక్కుకుపోయినట్లు సమాచారం. ఇక ఈ విషయంపై వినీత్ కిషోర్ మిశ్రా తండ్రి, మాజీ ఆర్మీ అధికారి లలిత్ కిషోర్ మిశ్రా మాట్లాడుతూ.. తన కుమారుడ్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
మూడు నెలలుగా తమ కుమారుడు కరాచీ పోర్టులో ఇబ్బంది పడుతున్నాడని అన్నారు. ఈ అంశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక చొరవ తీసుకుని కరాచీ పోర్టులో చిక్కుకున్న తమ కుమారుడితోపాటు ఇతర భారతీయులను స్వదేశానికి రప్పించాలని కోరారు. అలాగే వినీత్ కిషోర్ మిశ్రా భార్య నేహా మిశ్రా ఆందోళన వ్యక్తం చేసింది. తమకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని.. వాళ్లు కూడా తండ్రి కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. ఇక ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకు ఫోన్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో వినీత్ కిషోర్ మిశ్రా తండ్రి లలిత్ కిషోర్ మిశ్రా మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా ఇదే విషయంపై దిల్లీలోని అధికారుల చుట్టూ తిరుగుతున్నానని తెలిపారు. అలాగే రాష్ట్రపతి భవన్ లో, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు పత్రం అందించినట్లు పేర్కొన్నారు.

" నేను ఈ రోజు కూడా నా కుమారుడితో ఫోన్ లో మాట్లాడాను. అతను ఇంకా కరాచీ పోర్ట్ లోనే ఉన్నాడు. అక్కడ మొబైల్ ఫోన్ రీఛార్జీల ధరలు అధికం. దాంతో మేము ఎక్కువ సేపు మాట్లాడలేము. నా కుమారుడితోపాటు మరో ఐదుగురు భారతీయులు.. ఆరుగురు ఇరాన్ దేశస్థులు కూడా కరాచీ పోర్టులో చిక్కుకుని ఉన్నారు. తమ కాంట్రాక్ట్ ముగిసిందని స్వదేశానికి పంపించమని అక్కడి అధికారుల్ని కోరినా వాళ్లు నిరాకరిస్తున్నారని నా కుమారుడు తెలిపాడు. అలాగే ఇస్లామాబాద్ లోని భారత దౌత్య కార్యాలయాన్ని కూడా సంప్రదించాడు. కానీ ఎలాంటి పరిష్కారం లభించలేదు" అని లలిత్ కిషోర్ మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే వినీత్ కిషోర్ మిశ్రా భార్య నేహా మిశ్రా మాట్లాడుతూ.. తనకు రెండున్నరేళ్ల బాబు అలాగే 10 నెలల కూతురు ఉందని వాళ్లు తండ్రి ఎక్కడ అని అడుగుతున్నారని వాపోయారు. తన కుమారుడు.. నాన్న ఎప్పుడు వస్తాడు..? అని రోజూ అడుగుతున్నాడని.. డ్యూటీకి వెళ్లాడు.. త్వరలోనే వస్తాడు.. అని చెప్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications
