ఆ సినిమాలో కూడా వేలుపెట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్!
మాటల మాంత్రికుడిగా తెలుగు పరిశ్రమ పిలుచుకునే రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ఎంతో స్నేహంగా ఉంటారనే సంగతి తెలిసిందే. జనసేన పార్టీవల్ల రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉండటంతో సినిమా కథ, కథనాలపై పూర్తి శ్రద్ధ పెట్టడం కష్టమని పవన్ భావిస్తున్నారు. దీంతో తాను చేసే సినిమాల ఔట్ పుట్ బాగా వచ్చే బాధ్యతను త్రివిక్రమ్ కు కట్టబెట్టారు.
పవన్ కల్యాణ్ సినిమా ప్రారంభం కావాలన్నా.. విడుదల చేయాలన్నా త్రివిక్రమ్ ఓకే అన్నతర్వాతే జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో పవన్ వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలతో విజయాన్ని అందుకున్నారు. బ్రో మాత్రం యావరేజ్ గా నిలిచింది. వాస్తవానికి ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకున్నప్పటికీ కొద్దోగొప్పో కలెక్షన్లు రావడంతో యావరేజ్ అంటున్నారు. బ్రో సినిమాకు కథ, మాటలు త్రివిక్రమే అందించారు. కానీ ఆయన ప్రభావం పనిచేసినట్లు లేదు.

ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో పవన్ ఓజీ చేస్తున్నారు. సగానికి పైగా షూటింగ్ ను కూడా ఈ సినిమా పూర్తిచేసుకుంది.ఉస్తాద్ భగత్ సింగ్, హరిహరవీరమల్లు సినిమాలకన్నా ఓజీ ముందుగానే విడుదలైద్దనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి తగినట్లుగానే షూటింగ్ కూడా శరవేగంగా సాగింది. అయితే తాజాగా ఈ సినిమా విడుదలను 2024 ఏప్రిల్ కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. పవన్ మరో 30 రోజులు కాల్షీట్లు కేటాయిస్తే ఓజీ పూర్తవుతుంది. ఇలా వాయిదా పడటం వెనక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.
ఓజీ సినిమాకు త్రివిక్రమ్ పనిచేయకపోయినప్పటికీ దాన్ని సెట్ చేయడంలో మాత్రం కీలక పాత్ర పోషించారు. ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోతే త్రివిక్రమ్ పై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బ్రో సినిమాకు పనిచేసినప్పటికీ సరైన విజయాన్ని కట్టబెట్టలేకపోయారంటూ అభిమానులు త్రివిక్రమ్ పై మండిపడుతున్నారు. దర్శకుడు సుజిత్ త్రివిక్రమ్ సహకారంతోనే స్క్రిప్ట్ రాశారు. ఈ సినిమా ఔట్ పుట్ బాగా రావడానికి, కొన్ని మార్పులు చేర్పుల కోసం వాయిదా వేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో తను బిజీగా ఉండటంతో అది పూర్తయిన తర్వాత ఓజీపై పూర్తిస్థాయిలో దృష్టిసారించి బ్లాక్ బస్టర్ సినిమాగా రూపుదిద్దాలనుకుంటున్నారు. ఆయన కోరిక ఎంతవరకు నెరవేరుతుందో చూద్దాం.












Click it and Unblock the Notifications