అధికారంపై కెసిఆర్ ధీమా: ఒంటరిపోరే, గెలుపు గుర్రాలకే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి సై అంటున్నారు. కాంగ్రెసు పార్టీతో పాటు సిపిఐ, మజ్లిస్, న్యూడెమోక్రసీ, బిజెపి తదితర పార్టీలతో పొత్తుకు దూరంగా ఉండాలని లేదా ఆ పార్టీలే దూరంగా ఉండనున్నాయంటున్నారు. పొత్తులు లేకపోయినప్పటికీ తమ పార్టీకే మోజార్టీ వస్తుందని కెసిఆర్ ధీమాగా ఉన్నారంటున్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెరాస ఒంటరి పోరు దిశగా సాగుతోంది.
కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని పార్టీ అధినేత కెసిఆర్ ఇప్పటికే ప్రకటించగా.. సిపిఐ, ఎంఐఎం, న్యూడెమొక్రసీ కూడా తెరాసకు దూరం జరిగే సంకేతాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్, సిపిఐ, ఎంఐఎం, న్యూడెమోక్రసీలతో పొత్తు పెట్టుకోవాలనే భావన పార్టీ అధిష్ఠానం ముఖ్యుల్లో పలువురికి అంతర్గతంగా ఉన్నప్పటికీ, తామే మెజారిటీ స్థానాల్లో పోటీ చేయాలని కోరుకుంటుండటం, సీట్ల సర్దుబాటు ఆయా పార్టీలకు సమ్మతం కాకపోవడం తెరాసను ఒంటరి పోరు వైపు నడిపిస్తున్నాయని చెబుతున్నారు.

కాంగ్రెస్‌తో పొత్తుకు సుముఖత వ్యక్తం చేసిన సిపిఐ, ఇప్పటి వరకూ తెరాసతో పొత్తు లేదని అధికారికంగా చెప్పలేదు. కానీ బెల్లంపల్లి, మునుగోడు, హుస్నాబాద్ వంటి కొన్ని అసెంబ్లీ సీట్లు, మరికొన్ని లోకసభ స్థానాల విషయంలో ఇరు పార్టీలూ పట్టుదలగా ఉండటంతో, తమ మధ్య పొత్తు పొడిచే అవకాశాలు బలహీనపడుతున్నట్లుగా చెబుతున్నారు. మరోవైపు మజ్లిస్‌నుఫ్రెండ్లీ పార్టీగా చూస్తున్నట్లు స్వయంగా కెసిఆరే ప్రకటించి, ఆ పార్టీతో అవగాహనకు సిద్ధంగా ఉన్నప్పటికీ, తెరాసతో కలిసి ఎన్నికలకు వెళ్లడానికి మజ్లిస్ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.
కరీంనగర్‌లో శుక్రవారం జరిగిన సభలో మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ.. తెరాస, టిడిపి రెండూ రెండేనని, అవి తెర వెనుక బిజెపికి మద్దతునిస్తున్నాయని, వాళ్లకు ఓటేస్తే బిజెపికి, మోడీకి ఓటేసినట్లేనని వ్యాఖ్యానించడం గమనార్హం. న్యూడెమొక్రసీలో ఒంటరి పోరుకు సిద్దమవుతోందంటున్నారు. కాంగ్రెస్ విషయానికొస్తే.. కెసఆర్ తమపై చేస్తున్న రాజకీయ దాడిని ఒకవైపు భరిస్తూ, మరోవైపు తెరాసతో పొత్తుకు తలుపులు తెరిచి ఉన్నాయని చెబుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలను, తమ సిటింగ్ స్థానాలపై ఆయన కన్నేసి వ్యవహరిస్తున్న తీరు కలవరపెడుతోంది.
కాగా, ఒంటరిగా పోటీ చేసినప్పటికీ, మెజారిటీ స్థానాలు తమకే దక్కుతాయనే ధీమాతో ఉన్న కెసిఆర్.. అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు ఆయన గెలిచే వారికే టికెట్లు ఇవ్వడానికి పావులు కదుపుతున్నారని, వివిధ నియోజకవర్గాల్లో చేరికలు ఆ వ్యూహంలో భాగమేనని అంటున్నారు. పార్టీ సిటింగ్ ఎమ్మెల్యేల విషయంలోనూ గెలుపు గుర్రం ఫార్ములానే అధిష్ఠానం అనుసరిస్తోందంటున్నారు.












Click it and Unblock the Notifications