రాయల టీకి ఒప్పుకోం: వివేక్, సిఎం సోదరుడిపై ఫైర్
ఆదిలాబాద్: రాయల తెలంగాణకు తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ స్పష్టం చేశారు. శనివారం ఉదయం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తెలంగాణను అడ్డుకోవాలని యత్నిస్తున్నారని ఆరోపించారు.
బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణకు నీటి కేటాయింపులు జరపాలని వివేక్ డిమాండ్ చేశారు. ఆంధ్ర కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే నీటి లభ్యత లేకపోయినా ప్రాజెక్టులకు అనుమతిచ్చారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడిపై వివేక్ తీవ్రమైన ఆరోపణలు చేశారు.

ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులోని గోదావరి నుంచి అక్రమ ఇసుక రవాణాలో, మరో జిల్లాలో నందగిరి హిల్స్ భూకబ్జాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడి పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. సింగరేణిలో 60 శాతం వాటాను, నాగార్జున ప్రాజెక్టులో వాటాలు కావాలని అడగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి తన పదవిని కాపాడుకునేందుకు సీమాంధ్ర ఉద్యమాన్ని సృష్టించారని ఆయన విమర్శించారు. కాంగ్రెసు పార్టీని నాశనం చేసిన ఘనత కిరణ్ కుమార్ రెడ్డికే దక్కుతుందని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications