జగన్ ఆస్తుల కేసులో సాయిరెడ్డికి హైకోర్టు షాక్- ఈడీ కేసుల విచారణపై దక్కని ఊరట
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఏ 2 నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఇవాళ తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఆయనకు అక్కడా ఊరట దక్కలే్దు. సాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది.
జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ వేర్వేరు ఛార్జిషీట్లు దాఖలు చేస్తున్నాయి. ముందుగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ల ఆధారంగా ఈడీ కూడా ఛార్జిషీట్లు దాఖలు చేస్తోంది. అయితే సీబీఐ ఛార్జిషీట్లతో పాటే ఈడీ ఛార్జిషీట్లను కూడా విచారించాలని లేదంటే, సీబీఐ ఛార్జిషీట్లనే ముందుగా విచారించాలని గతంలో సీబీఐ కోర్టును ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. అయితే ఇందుకు సీబీఐ కోర్టు నిరాకరించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

జగన్ ఆస్తుల కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి వీటిలో సీబీఐ, ఈడీ వేర్వేరుగా దాఖలు చేసిన ఛార్జిషీట్లపై వేర్వేరు విచారణలు జరగకుండా అడ్డుకునేందుకు హైకోర్టును ఆశ్హయించారు. సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన హైకోర్టులో సవాల్ చేశారు.. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈడీ కేసులపై ముందుగా విచారణ జరపాలన్న సీబీఐ కోర్టు తీర్పును సమర్ధించింది. దీంతో విజయసాయిరెడ్డికి షాక్ తప్పలేదు. ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ శరవేగంగా సాగుతుండటంతో ఇబ్బందులు పడుతున్న సాయిరెడ్డి.. ఇప్పుడు సీబీఐ కోర్టు తీర్పును హైకోర్టు కూడా సమర్ధించడంతో మరింత ఇబ్బందుల్లో పడబోతున్నారు.
మరోవైపు ఇదే అంశంపై జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్స్, రఘురాం సిమెంట్స్ కూడా తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు వేశాయి. వీటిని కూడా హైకోర్టు కొట్టేసింది. సీబీఐ కోర్టు ముందుగా ఈడీ కేసుల్ని విచారించడం వల్ల పిటిషనర్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో సాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్, రఘురాం సిమెంట్స్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. జగన్ ఆస్తుల కేసుల్లో సాధ్యమైనంత త్వరగా తీర్పు ఇచ్చేందుకు సిద్దమవుతున్న సీబీఐ కోర్టు.. ఇఫ్పటికే రెగ్యులర్ గా విచారణ చేపడుతోంది. దీన్ని ఆలస్యం చేసేందుకు సాయిరెడ్డితో పాటు మరికొందరు ఈ పిటిషన్లు వేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.












Click it and Unblock the Notifications