TTD: పాలక మండలి సభ్యుల దర్శనం కోటాపై పై కీలక నిర్ణయం..!!
Tirumala: టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. పాలక మండలి ధర్శన కోటా పైన బోర్డు ఛైర్మన్ భూమన కీలక వ్యాఖ్యలు చేసారు. తిరుమలలో క్వార్టర్ల అభివృద్ధి పనులు చేపట్టేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చారిత్రక ఆలయాల్లో అభివృద్ధి పనులను శ్రీవాణి ట్రస్టు నిధుల ద్వారా చేపట్టేందుకు ఆమోదిస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది.
పరిమితి విధింపు:
టీటీడీ పాలక మండలి సభ్యుల దర్శన కోటా పై ఛైర్మన్ భూమన తాజాగా సూచనలు చేసారు. పాలక మండలి సభ్యుల పరిమిత సంఖ్యలో దర్శనానికి రావాలని సూచించారు. ఇష్టానుసారం దర్శనానికి రావటం సరికాదన్నారు. దీని కారణంగా సాధారణ భక్తులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని..పరిమితం చేసుకోవాలని కోరారు.

కుటుంబ సభ్యులతో పరిమిత సార్లు వస్తేనే దర్శనానికి అవకాశం ఉంటుందని తేల్చి చెప్పారు. ఇతరులతో వస్తే అనుమతించటం పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పాలక మండలి సమావేశంలో స్విమ్స్ ఆసుపత్రిలో రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు 479 నర్సు పోస్టులు క్రియేట్ చేసేందుకు ఆమోదం తెలిపారు.
కీలక నిర్ణయాలు
టీటీడీలో గతంలో చాలామంది నోటిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్(ఆర్‌వోఆర్) ద్వారా కాకుండా బోర్డు ఆమోదంతో పరిపాలనా సౌలభ్యం కొరకు కాంట్రాక్టు/పొరుగుసేవల ఉద్యోగులను తీసుకోవడం జరిగింది. జి.ఓ.నం.114 ప్రకారం కొన్ని నిబంధనలను సడలించి వారి సేవలు క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపాలని నిర్ణయించారు.
టీటీడీ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థినీ విద్యార్థులందరికీ ఎలాంటి సిఫారసు లేకుండా హాస్టల్ వసతి కల్పించడం కోసం అవసరమైన హాస్టళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. రూ.1.88 కోట్లతో తిరుమలలో భక్తుల సౌకర్యార్థం పిఏసి-1 లో 10 లిఫ్టులు ఏర్పాటుకు టెండరు ఆమోదం లభించింది. రూ.1.50 కోట్లతో బాలాజి నగర్ తూర్పువైపున, అదేవిధంగా, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం ఔటర్ కార్డన్ ప్రాంతంలో మిగిలిపోయిన ఫెన్సింగ్ ఏర్పాటుకు ఆమోదించారు.
అభివృద్ధి పనులు
రూ.14 కోట్లతో తిరుమలలో టీటీడీ ఉద్యోగుల పాత సి టైప్, డి టైప్, కొత్త సి టైప్, డి టైప్ క్వార్టర్లలో మిగిలి ఉన్న 184 క్వార్టర్ల అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని భాష్యకార్ల సన్నిధిలోని మకర తోరణానికి, శ్రీ పార్థసారథిస్వామి, శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి తిరువాభరణాలకు బంగారు పూత పూసేందుకు ఆమోదం లభించింది.
టీటీడీ ఆధ్వర్యంలో 15 చారిత్రాత్మక, పురాతన ఆలయాలు, 13 టీటీడీ నిర్మించిన ఆలయాలు, 22 ఆధీనంలోకి తీసుకున్న ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లో అవసరమైన అభివృద్ధి పనులను శ్రీవాణి ట్రస్టు నిధుల ద్వారా చేపట్టేందుకు పాలన అనుమతి ఇచ్చారు. ఇటీవల ఘాట్ రోడ్డులో ప్రమాదవశాత్తు మరణించిన తిరుమల శ్రీవారి ఆలయ పరిచారిక శ్రీయతిరాజన్ నరసింహన్ కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.












Click it and Unblock the Notifications