శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంపు - రెండేళ్ల తరువాత మొదలు : టీటీడీ బోర్డు నిర్ణయం..!!
శ్రీవారి ఆర్జిత సేవాల టిక్కెట్ల ధరలను పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ రోజ సమావేశమైన టీటీడీ బోర్డు పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. మరోవైపు రూ.3,096 కోట్ల అంచనాతో 2022-23 వార్షిక బడ్జెట్‌కు టీటీడీ ఆమోదం పలికింది. రూ.230 కోట్ల వ్యయంతో పద్మావతి చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది. స్విమ్స్ ఆస్పత్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని తీర్మానించింది. రూ. 2.7 కోట్ల వ్యయంతో స్విమ్స్ ఆస్పత్రిని పూర్తిగా కంప్యూటీకరణ చేయాలని నిర్ణయించింది. టీటీడీ ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు రూ.25 కోట్లు కేటాయించింది.
తిరుమలలో అన్నప్రసాదాన్ని మరిన్ని ప్రదేశాలలో భక్తులకు ఉచితంగా అందించాలని నిర్ణయించింది. నాదనీరాజనం మండపాని శాశ్వత ప్రాతిపాదికన నిర్మిస్తామని తెలిపింది. ఆయుర్వేద ఫార్మసీని రూ. 3.6 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తామంది. శ్రీనివాస సేతు ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.100 కోట్లు విడుదల చేశామని.. ఈ ఏడాది డిసెంబర్ లోగా మరో రూ.150 కోట్లు విడుదల చేస్తామని టీటీడీ వెల్లడించింది. రెండేళ్ల కాలంగా నిలిచిన ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించాలని బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పాతికేళ్ల క్రితం ఆర్జిత సేవల ధరలు నిర్ణయించారని..అవే ధరలు ఇప్పటికీ కొనసాగుతుండటంతో పెంచాలని బోర్డు నిర్ణయించింది.

ఈ మేరకు ఇక నుంచి సుప్రభాత సేవకు రూ.2 వేలు, తోమాల, అర్చన సేవలకు రూ.5వేలు, వేద ఆశీర్వచనానికి రూ.10 వేలు, కళ్యాణోత్సవానికి రూ.2,500, వస్త్రాలంకరణ సేవా టికెట్ ధరను రూ.లక్షకు పెంచాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఆనంద నిలయానికి బంగారు తాపడ పనులతో పాటు అన్నమయ్య నడక మార్గాన్ని అభివృద్ధి చేయాలని సమావేశంలో తీర్మానించారు. అదేవిధంగా అలిపిరి వద్ద ఆధ్యాత్మిక సిటీ నిర్మాణానికి టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా శ్రీవారి ప్రసాద వితరణ మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టటంతో భక్తుల సంఖ్య సైతం పెరిగింది. దీంతో..యథావిధిగా శ్రీవారి కార్యక్రమాలు కొనసాగించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications