ప్రధాని గోల్డ్ డిపాజిట్ స్కీంలో చేరాలా? వద్దా?: టీటీడీ తర్జన భర్జన
తిరుమల: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పసిడి పథకంలో టీటీడీ చేరాలని ఏపీ ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పసిడి పథకంలో చేరే సాధ్యాసాధ్యాలపై టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యయనం చేయనుంది. ఇందులో భాగంగా సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవన్ అతిధి గృహంలో సమావేశం కానుంది.
టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు నేతృత్వంలో జరగనున్న సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రధాన మంత్రి గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌లో చేరాలా? వద్దా? అనే విషయంలో టీటీడీ పాలకమండలి తర్జన భర్జన పడుతుంది. ఏపీ ప్రభుత్వం సూచన మేరకు దీనిపై సోమవారం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఆ తర్వాత ఇందులో చేరే విషయంపై తమ అభిప్రాయాన్ని టీటీడీ తెలియజేయనుంది.
పసిడి పథకంలో టీటీడీ చేరితే 2.5 శాతంగా వడ్డీ చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే వడ్డీ మొత్తాన్ని నగదు రూపంలోనే చెల్లిస్తామని బ్యాంకులు చెబుతున్నాయి. అయితే ఇది టీటీడీ నిబంధనలకు విరుద్ధం. ఈ పసిడి పథకంలో గనుక చేరితే వడ్డీగా తిరిగి బంగారాన్నే తీసుకునే ఆలోచనలో టీటీడీ ఉంది.

దీంతో పాటు విచక్షణ కోటాలో మంజూరు చేసే వీఐపీ దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్ల పెంపుతో పాటు సబ్బిడీ లడ్డూల ఎత్తివేతపై చర్చించనున్నారు. అదే విధంగా ఈ నెల 21 వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, వీఐపీ టికెట్ల కేటాయింపు విధానంపై కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం 3 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. అదే విధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.












Click it and Unblock the Notifications