టీటీడీకీ, అధికారులకూ మధ్య గ్యాప్-బీఆర్ నాయుడు క్లారిటీ..!
తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలకమైన బోర్డు, అధికారులకూ మధ్య గ్యాప్ ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై ఛైర్మన్ బీఆర్ నాయుడు ఇవాళ స్పందించారు. తిరుపతిలో భక్తుల తొక్కిసలాటకు వీరి మధ్య విభేదాలే కారణమన్న ఊహాగానాలపైనా మాట్లాడారు. సోషల్ మీడియా వార్తల్ని నమ్మొద్దంటూ భక్తులకు ఓ సలహా కూడా ఇచ్చారు. తిరుపతి తొక్కిసలాట ఘటన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఛైర్మన్ బీఆర్ నాయుడు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తిరుపతిలో భక్తుల తొక్కిసలాట తర్వాత అక్కడ పర్యటించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఛైర్మన్, ఈవో సమన్వయ లోపంపై మాట్లాడారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య గ్యాప్ వల్లే తొక్కిసలాట జరిగిందా అన్న చర్చ మొదలైంది. దీనిపై ఇవాళ మరోసారి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు స్పందించారు. తమ మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారాన్ని వీరిద్దరూ ఖండించారు.

టీటీడీ బోర్డుకూ, ఈవోకు మధ్య విబేధాలున్నాయన్న ప్రచారాన్ని ఛైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. బోర్డుకూ, అధికారులకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదన్నారు. దీనిపై సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని నమ్మొద్దని భక్తుల్ని కోరారు. మీడియాలోనూ వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు ప్రచురించవద్దని బీఆర్ నాయుడు సూచించారు. అందరూ కలిసి సమన్వయంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు టీటీడీ ఈవో శ్యామలరావు కూడా టీటీడీలో ఎలాంటి సమన్వయ లోపం లేదని క్లారిటీ ఇచ్చారు. టీటీడీలో ఛైర్మనే కీలకమని, బోర్డు నిర్ణయాల్ని అదికారులు అమలు చేస్తారనన్నారు. మరోవైపు తిరుపతి వైకుంఠ దర్శనం టోకెన్ల కోసం భక్తుల్ని అనుమతించే విషయంలో కొన్ని లోపాలు జరిగాయని శ్యామలరావు అంగీకరించారు. అయితే ఛైర్మన్ కూ, తనకూ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. తాను ఎవరితోనూ అమర్యాదగా మాట్లాడనని ఈవో స్పష్టం చేశారు. తొక్కిసలాట వంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications