ఇందాపూర్ నుంచి 10 లక్షల కిలోల నెయ్యి: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
హెరిటేజ్ కు చెందిన ఇందాపూర్ డెయిరీ నుంచి కొనుగోలు చేసిన కల్తీ నెయ్యిని శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న విమర్శల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు తెరపైకి వచ్చారు. ఈ వివాదంపై స్పందించారు. సుదీర్ఘ వివరణ ఇచ్చారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే ఆవు నెయ్యి కొనుగోలులో పారదర్శకత, నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇస్తోన్నామని తెలిపారు.
2004కు ముందు శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత, రుచిపై వచ్చిన విమర్శలు, భక్తుల అనుమానాలను పరిగణనలోకి తీసుకుని, తన హయాంలో ఏర్పాటైన టీటీడీ బోర్డు.. నెయ్యి కొనుగోలు విధానంలో మార్పులు చేపట్టిందని పేర్కొన్నారు. రవాణా సమయంలో నెయ్యి నాణ్యత దెబ్బతినకుండా ఉండేటానికి గతంలో ఉన్న 1500 కిలో మీటర్ల సేకరణ పరిధిని 800 కి.మీ.లకు తగ్గించామని, నెయ్యి రవాణా చేసే ట్యాంకర్లకు తప్పనిసరిగా జీపీఎస్ లాక్ సిస్టమ్‌ను అమర్చామని వివరించారు.

డెయిరీ ప్రాసెసర్ల తయారీ సిద్ధతను అంచనా వేసేందుకు ఎంఆర్ఎల్ స్కోర్ బోర్డ్ విధానాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. ఎఫ్ఎస్ఎస్ఆర్ రూపొందించిన నిబంధనలతో పాటు, మిల్క్ ఫ్యాట్ ప్యూరిటీ పరీక్షలు, సెన్సరీ పారామీటర్స్ ను కఠినతరం చేసినట్లు బీఆర్ నాయుడు పేర్కొన్నారు. 2024 నుండి 2025 మధ్య కాలంలో గుత్తాధిపత్యానికి తావివ్వకుండా ఏడు విడతలుగా టెండర్లు నిర్వహించి, పారదర్శకంగా మొత్తం 65 లక్షల కిలోల నెయ్యి సేకరణకు చర్యలు తీసుకున్నామని అన్నారు.
ఏడు ప్రముఖ డెయిరీ సంస్థలు 1. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (నందిని)- 4, మదర్ డెయిరీ - 2, ఇందాపూర్ - 2, సంగం డెయిరీ - 1 దక్కినట్లు బీఆర్ నాయుడు వివరించారు. మిగిలిన మూడు సంస్థలు- ప్రీమియర్ అగ్రి, కొల్హాపూర్ (గోకుల్), గోవింద్ మిల్క్ కు టెండర్లు లభించలేదని చెప్పారు.
2024 నుండి నందిని డెయిరీని తప్పించారనే ప్రచారంలో వాస్తవం లేదని, మొత్తం ఏడింట్లో నాలుగు టెండర్లు ఆ సంస్థకే దక్కాయని ఆయనర గుర్తు చేశారు. కేజీ రూ. 495 తో 10 లక్షలు కేజీలు, రూ. 513తో 20 లక్షల కేజీలు, రూ. 600 లతో 10 లక్షల కేజీలు, రూ. 716.92తో 20 లక్షల కేజీల నెయ్యిని కొనుగోలు చేసినట్లు చెప్పారు. దీనిలో 10 లక్షల కేజీల నెయ్యి మాత్రమే సరఫరా చేయగలమని కేఎంఎఫ్ తెలిపిందని అన్నారు. 2019-24 మధ్య నందినీ డైరీకి ఎటువంటి టెండర్లు ఇవ్వలేదని పేర్కొన్నారు.
ఇందాపూర్ డెయిరీకి మాత్రమే టెండర్ ఇచ్చారనడం అవాస్తవమని, ఏడింట్లో రెండు టెండర్లు ఈ సంస్థకు లభించాయని బీఆర్ నాయుడు తెలిపారు. రూ. 658 తో 6.5 లక్షలు కేజీలు, రూ. 657 తో 3.5 లక్షల కేజీలు మొత్తంగా 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయడానికి ఇందాపూర్ ముందుకు వచ్చిందని పేర్కొన్నారు.
2016లో ఆవు పాల ధర రూ.17 నుండి రూ.20 మధ్య ఉన్నప్పుడు ఆవు నెయ్యి ధర రూ.278గా ఉండేదని, ప్రస్తుతం ఆవు పాల ధర రూ.42 కు పెరగడంతో మార్కెట్ ధరలకు అనుగుణంగా ఇప్పుడు నెయ్యి ధర రూ. 658 లకు పెరిగిందని వివరించారు. కమిషన్ల కోసం రేటు పెంచారనడంలో అర్థం లేదని ఎన్డీడీబీ సూచించే ధరలను పరిగణనలోకి తీసుకున్నామని బీఆర్ నాయుడు తెలిపారు.
పెరిగిన ధరల వల్ల నందిని డెయిరీ 20 లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేయలేమని, 10 లక్షల కిలోలను మాత్రమే సరఫరా చేస్తామని చెప్పడం వల్ల రవాణా పరిధిని దాటి ఎల్ 2 గా నిలిచిన జాతీయ స్థాయి డైరీలకు అవకాశం ఇచ్చామని ఆయన అన్నారు. 2019-24 మధ్య ఇందాపూర్ డెయిరీ టెండర్లలో పాల్గొనలేదని, 2019-24 మధ్య ఆరు సార్లు టెండర్లలో పాల్గొందని చెప్పారు.












Click it and Unblock the Notifications