టీటీడీ ఈఓ కీలక ఆదేశాలు
TTD: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి రానుండటంతో దీనికి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లను చేపట్టారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబర్ 28వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 6వ తేదీ వరకు కొనసాగుతాయి. మొదటి రోజున చిన్నశేష వాహనంపై అమ్మవారు ఊరేగుతారు. 29న పెదశేష వాహనం, హంసవాహనం, 30న ముత్యాలపందిరి, సింహ వాహనం, డిసెంబర్ 1న కల్పవృక్ష వాహనం, హనుమద్వాహన సేవలు జరుగుతాయి.

2న పల్లకి ఉత్సవం, గజవాహనం, 3వ తేదీన బంగారు రథంపై అమ్మవారిని ఊరేగిస్తారు. సాయంత్రం గరుడ వాహనంపై దర్శనం ఇస్తారు. 4న సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలను నిర్వహిస్తారు. 5వ తేదీన రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం అశ్వవాహనం, 6న తిరుచ్చి ఉత్సవం, పంచమీ తీర్థాన్ని జరుపుతారు. అదే రోజు సాయంత్రం ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
బ్రహ్మోత్సవాల కోసం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుచానూరుకు వస్తారని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు. టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు సమీక్ష నిర్వహించారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు తదితర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని శ్యామలరావు సూచించారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి, శిల్పారామం, తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేయాలని అన్నారు.
పంచమితీర్థం నాడు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేయాలని శ్యామలరావు అన్నారు. భక్తులకు సరిపడా తాత్కాలిక, మొబైల్ మరుగుదొడ్లను అందుబాటులో ఉంచాలని, మెరుగ్గా పారిశుద్ధ్యం ఉండాలని సూచించారు. భక్తులకు వైద్య సేవలందించేందుకు డాక్టర్లు, ఇతర పారామెడికల్ సిబ్బందిని నియమించాలని అన్నారు.
లక్షలాదిమంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని శ్యామలరావు అన్నారు. పంచమితీర్థం రోజున భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు అదనపు సిబ్బందిని నియమించాలని, సీసీటీవీల ద్వారా భద్రతను పర్యవేక్షించాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications