తిరుమలకు వెళ్ళే సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ శుభవార్త!
తిరుమలలో భక్తులకు సౌకర్యాలపై నిత్యం కసరత్తు చేస్తున్న టీటీడీ తిరుమల వేదికగా జరిగే ఉత్సవాలపై అంతే బాగా ఫోకస్ చేస్తుంది. ఇప్పటికే తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో వైకుంఠ ఏకాదశికి సంబంధించి వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లు ఘనంగా చెయ్యాలని నిర్ణయించారు.
10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు
వచ్చే జనవరి 10న వైకుంఠ ఏకాదశి ఉండటంతో వైకుంఠ ద్వార దర్శనాల విషయంలో టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం నిర్వహించారు. నేడు మధ్యాహ్నం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశంనిర్వహించి ఆయన కీలక ఆదేశాలు ఇచ్చారు. జనవరి 10 నుంచి 19వ తేది వరకు, మొత్తం 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలను టీటీడీ కల్పించనుంది.

వైకుంఠ ద్వార దర్శనాలలో సామాన్య భక్తులకే ప్రాధాన్యత
ఇక శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు నలభై రోజులు మాత్రమే ఉండటంతో అధికారులు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని ఆయా శాఖల అధికారులందరినీ అడిషనల్ ఈఓ ఆదేశించారు. అయితే పది రోజుల పాటు జరిగే వైకుంఠ ద్వార దర్శనాల్లో సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పేర్కొన్నారు.
పది రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాల పది రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చెయ్యాలని నిర్ణయించారు. ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రం దర్శనాలు కల్పించనుంది. జనవరి 10 నుండి 19వ తేది వరకు వరకు 10 రోజుల పాటు చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్ఆర్ఐ దర్శనాలు రద్దు చెయ్యాలని నిర్ణయించారు. జనవరి 09 నుండి 19 వరకు ఆర్జిత సేవలు రద్దు చేయనున్నట్టు నిర్ణయం తీసుకున్నారు.
వైకుంఠ ఏకాదశి మౌలిక అవసరాలపైన సమీక్ష
సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన సమయం కల్పించేలా జారీ చేయాల్సిన టికెట్ల కోటా పైన , అలాగే ఇతర అంశాలపై మరో రెండు వారాల్లో మరో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశికి కావలసిన పూల అలంకరణలు, భక్తులకు వసతి, శ్రీవారి సేవకులు, స్కౌట్‌లను నియమించడం, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం, ఇతర అంశాలపై కూడా ఆయన చర్చించారు.
జనవరి 10న స్వర్ణ రధం, 11న చక్ర స్నానం
జనవరి 10న స్వర్ణ రధం ఊరేగింపు ఉంటుందని, అలాగే 11న చక్ర స్నానం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇది ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుందని పేర్కొన్నారు. ఇక మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో 10 రోజుల పాటు ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్న ప్రసాదం పంపిణీ చేయబడుతుందని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు.












Click it and Unblock the Notifications