TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త: త్వరలో వాచీలు, మొబైల్స్ ఈ వేలం; ఎప్పుడంటే!!
సప్తగిరులపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి టిటిడి ఎప్పటికప్పుడు అన్ని వివరాలను భక్తులకు అందిస్తోంది. ఈ క్రమంలోనే టీటీడీ తాజాగా శ్రీవారి భక్తులకు ఒక శుభవార్త చెప్పింది. వాచీలు, మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేసుకోవాలనుకునే వారు స్వామివారి హుండీలలో భక్తులు సమర్పించిన వాటిని కొనుగోలు చేసుకునేందుకు అద్భుతమైన అవకాశాన్ని ఇస్తోంది.
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో స్వామి వారి పై భక్తితో భక్తులు హుండీ ద్వారా కానుకగా సమర్పించిన వాచీలు మరియు మొబైల్ ఫోన్లను మార్చి 13న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది.

ఇక టీటీడీ వేలం వేసే వాటిలో టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాట, టైమ్‌వెల్, ఫాస్ట్‌ట్రాక్, ర్యాడో కంపెనీల వాచీలున్నాయి. ఆదేవిధంగా ఐ ఫోన్లు, వివో, నోకియా, కార్బన్, శామ్సంగ్, మోటోరోలా, ఒప్పో కంపెనీల మొబైల్ ఫోన్లు వున్నాయి. కొత్తవి, ఉపయోగించిన, పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 23 లాట్లు, మొబైల్ ఫోన్లు 27 లాట్లు ఈ-వేలంలో ఉంచినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో కార్యాలయం వేళల్లో సంప్రదించాలని సూచించింది. టీటీడీ వెబ్‌సైట్ www.tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించాలని టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది.అంతేకాదు డయల్ యువర్ ఈవో కార్యక్రమం మార్చి 2వ తేదీ నిర్వహించనున్నట్టు పేర్కొంది. మార్చి రెండవ తేదీ ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుందని పేర్కొంది.
ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని తెలిపింది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261 గా వెల్లడించింది.












Click it and Unblock the Notifications