TTD: స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి - 19న ప్రత్యేకంగా..!!
Tirumala: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు పది రోజుల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలను పురస్కరించుకుని డిసెంబరు 19వ తేదీ మంగళవారంనాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఈ నెల 17 నుంచి పవిత్ర ధనుర్మాసం వేళ టీటీటీ ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ధనుర్మాసంలో సుప్రభాతం బదులు తిరుప్పావై నివేదించడం విశేషం.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం: సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. డిసెంబరు 19న ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు.

ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు.
శాస్త్రోక్తంగా కార్యక్రమం: శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈ కారణంగా ఆలయంలో అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 17 నుంచి 2024 జనవరి 14వ తేదీ వరకు తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా 216 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు.
సుప్రభాతం బదులు తిరుప్పావై: టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ధనుర్మాసంలో సుప్రభాతం బదులు తిరుప్పావై నివేదించడం విశేషం. తిరుపతిలో అన్నమాచార్య కళామందిరంతోపాటు ఏడు ప్రాంతాల్లో తిరుప్పావై ప్రవచనాలు పారాయణం చేస్తారు.
ఈ తిరుప్పావై సారాంశం భగవంతునికి కైంకర్యం చేయడమే. ఈ వ్రతం ఒకరు చేయడం కాకుండా అందరినీ కలుపుకుని చేస్తే గొప్ప ఫలితం ఉంటుందని పండితులు చెబుతారు. ఈ సంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా గల అన్ని వైష్ణవ దేవాలయాలలో తిరుప్పావై శాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.












Click it and Unblock the Notifications